Site icon NTV Telugu

Anemia Causes: రక్తహీనత వేధిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

Anemia Symptoms

Anemia Symptoms

Anemia Causes: రక్తహీనత అంటే సాధారణ సమస్య కాదని, ఇది శరీరానికి ముప్పు తెచ్చే నిశ్శబ్ద వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం ద్వారా ఆక్సిజన్‌ చేరవేయడం జరుగుతుంది. కానీ రక్తంలో హీమోగ్లోబిన్‌ స్థాయి తగ్గిపోతే దానిని రక్తహీనత (అనీమియా) అంటారు. చాలామంది దీన్ని చిన్న సమస్యగా భావిస్తారు, కానీ నిజానికి ఇది చాలా ప్రమాదకరమైనదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పలు గణాంకాల ప్రకారం.. పురుషుల్లో సుమారు 25%, మహిళల్లో 57%, పిల్లల్లో 67%, అలాగే గర్భిణీలలో 52% మంది భారతీయులు రక్తహీనతతో బాధపడుతున్నారు.

READ ALSO: AP High Court: కడప ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్..

రక్తహీనతతో ఏయే సమస్యలు వస్తాయంటే..
రక్తహీనత ఉన్నవారిలో శరీర శక్తి తక్కువగా ఉంటుంది. వారు త్వరగా అలసిపోవడం, నిరుత్సాహం, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల చిన్న సమస్య కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుండెపై అధిక ఒత్తిడి పడి, గుండె వాపు లేదా ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీయవచ్చని వైద్యులు అంటున్నారు.

సాధారణంగా మనం సరిగ్గా తినకపోవడం వల్ల రక్తం తక్కువగా ఉంటుందని అంటాం. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాస్తవానికి రక్తహీనత ఉన్నవారికి ఆకలి తగ్గుతుందని, అందుకే వాళ్లు తినడం తగ్గిస్తారని చెబుతున్నారు. మహిళల్లో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, హార్మోన్ల సమస్యలు (ఉదా: థైరాయిడ్), గర్భసంచి గడ్డలు వంటి పరిస్థితులు రక్తహీనతకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత ప్రమాదకరం, వీళ్లు రక్తహీనతతో బాధపడుతుంటే వీరికి పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుడతారని, అలాగే వీళ్లను ప్రసవం తర్వాత తీవ్రమైన నీరసం, బలహీనత ఆవరిస్తుందని చెబుతున్నారు.

కడుపులో అల్సర్ లేదా క్యాన్సర్ వంటి వ్యాధుల కారణంగా కూడా రక్తహీనత వస్తుందని, శరీరంలో ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ B12 లోపం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుందని నిపుణులు పేర్కొన్నారు. రక్తహీనతను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదని వైద్యులు హెచ్చరించారు. దీని లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సరైన పరీక్షలు చేయించుకొని, ఆహారంలో ఇనుము ఉన్న పదార్థాలు (ఉదా: పాలకూర, కూరగాయలు, జాగ్రి, బీట్రూట్, పొడి పండ్లు) చేర్చుకోవాలని చెబుతున్నారు.

READ ALSO: Hyderabad Man In Russia: దళారుల చేతుల్లో మోసపోయి.. రష్యాలో చిక్కుకున్న హైదరాబాదీ..

Exit mobile version