India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగం వస్తుందన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు డిగ్రీలు.. పీజీలు.. ఇంజనీరింగ్ చేసిన వాళ్లు కూడా ప్యూన్.. స్వీపర్ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. తక్కువ విద్యార్హత అవసరమైన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న వాళ్లు పోటీ పడకూడదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. లక్షలాది మంది ఉన్నత విద్యావంతులు ఎందుకు చిన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు? మన దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయికి చేరుకుంది? దీనివెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి ?
ఉద్యోగ నియామకాలపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఇటీవల సుప్రీంకోర్టు ఉద్యోగ నియామకాలపై ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. తక్కువ విద్యార్హత ఉన్నవారి కోసం ఉద్దేశించిన ఉద్యోగాలకు.. ఎక్కువ చదువుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేయకూడదని స్పష్టం చేసింది. కేవలం పదో తరగతి అర్హత ఉన్న బ్యాంకు అటెండెంట్ పోస్టు కోసం ఒక గ్రాడ్యుయేట్ తన డిగ్రీని దాచిపెట్టి ఉద్యోగం సంపాదించాడన్న కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఇలా చేయడం వల్ల నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని న్యాయస్థానం తెలిపింది. నియామకాల కోణంలో చూస్తే ఈ లాజిక్ కరెక్టే. కానీ ఈ తీర్పు మన సామాజిక వాస్తవాలను ప్రశ్నిస్తోంది. డిగ్రీలు, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీహెచ్డీ చేసిన వాళ్లు ప్యూన్, స్వీపర్ ఉద్యోగాలకు ఎందుకు పోటీ పడుతున్నారు? స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026 నివేదిక ప్రకారం 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులలో 67 శాతం మంది గ్రాడ్యుయేట్లే కావడం ఆందోళన కలిగించే అంశం.
Also Read
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
- Russia Vs Ukraine: 3000కిలోల బరువున్న బాంబును విసిరింది.. యుద్ధంలో గేర్ మార్చిన రష్యా!
- El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
స్వీపర్ పోస్టులకు అప్లికేషన్లు:
పదేళ్లుగా మన దేశంలో ఇలాంటి పరిస్థితులను మనం తరచూ చూస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ గ్రూప్ డి పోస్టులకు నోటిఫికేషన్ రాగానే.. లక్షల్లో దరఖాస్తులు వస్తుంటాయి. కేవలం 10వ తరగతి.. ఇంటర్మీడియట్ అర్హత ఉన్న క్లరికల్, ప్యూన్, క్లీనింగ్ పనులకు కూడా ఉన్నత విద్యావంతులు అప్లై చేస్తున్నారు. ఏళ్లుగా కష్టపడి బీటెక్, పీహెచ్డీ పూర్తి చేసి ఇలా స్వీపర్ ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నారన్న సందేహం రావడం సహజం. దీనికి ఒకటే కారణం.. ప్రభుత్వ ఉద్యోగం. అది ఎంత చిన్నదైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే భద్రత, స్థిరమైన ఆదాయం, ఆరోగ్య ప్రయోజనాలు, సామాజిక హోదా అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉండే అభద్రతా భావం కంటే.. ఏదో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడం మేలని యువత భావిస్తోంది.
విద్యావంతులు చిన్న ఉద్యోగాలకు పోటీ పడుతున్న తీరుకు గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలే నిదర్శనం. 2025 ఏప్రిల్ నెలలో రాజస్థాన్లో 53 వేల ప్యూన్ పోస్టులకు దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో పీహెచ్డీలు, ఎంబీఏలు చేసిన వారున్నారు. 2023 అక్టోబర్ లో కేరళలో కేవలం 7వ తరగతి అర్హత ఉన్న ప్యూన్ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2020లో పశ్చిమ బెంగాల్ లో 8వ తరగతి అర్హత ఉన్న ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీర్లు, రీసెర్చ్ స్కాలర్లు పోటీ పడ్డారు. బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్వీపర్, శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు క్యూ కట్టారు. భారతీయ లేబర్ మార్కెట్ అసలు స్వరూపం ఇదే.
విద్యావంతుల్లో ఉన్న నిరుద్యోగాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. లేటెస్ట్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం.. గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు 11.2 శాతంగా ఉంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. 15 నుంచి 25 ఏళ్ల వయసున్న గ్రాడ్యుయేట్లలో దాదాపు 40 శాతం మందికి ఉద్యోగాలు లేవు. చదువుకోని వారే నిరుద్యోగులుగా మిగిలిపోతారన్నది పాత మాట. ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నవారే ఎక్కువగా నిరుద్యోగుల జాబితాలో ఉంటున్నారు. బాగా చదువుకుంటే సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్లొచ్చని దశాబ్దాలుగా తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నత విద్య పెరిగినంత వేగంగా ఉద్యోగాల సృష్టి జరగడం లేదు.
ఒకప్పుడు కనీసం పదో తరగతి పాస్ కావాలని ఇంట్లో వాళ్లు అనేవారు. ఇప్పుడు కనీసం ఒక డిగ్రీ అయినా చేయాలంటున్నారు. డిగ్రీ స్థాయి పదో తరగతికి పడిపోయిందా అన్న అనుమానం కలుగుతుంది. వాస్తవానికి డిగ్రీకి పూర్తిగా విలువ పోలేదు. అది ఇంకా ఎన్నో వృత్తులకు అవసరమే. కాకపోతే అది ఉపాధికి పూర్తి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఈ రోజుల్లో కంపెనీలు సర్టిఫికెట్ల కంటే నైపుణ్యాల వైపే ఎక్కువగా చూస్తున్నాయి. కోడింగ్ వచ్చా.. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా.. కొత్త టెక్నాలజీని నేర్చుకోగలరా.. ఇలాంటి అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అటు కంపెనీలు తమకు నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దొరకడం లేదంటున్నాయి.. ఇటు యువత తమకు ఉద్యోగాలు రావడం లేదంటున్నారు. ఎలన్ మస్క్ లాంటి వాళ్లు డిగ్రీలతో పనిలేదని.. నైపుణ్యం ఉంటే చాలని చెబుతున్నారు. మన దేశంలో ఇంకా ఆ పరిస్థితి రాకపోయినా యువతలో మాత్రం ఆలోచన మొదలైంది.
ఓవైపు చదువుకు తగ్గ ఉద్యోగం రాక… మరోవైపు చిన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతే తమ పరిస్థితి ఏంటన్న భయం నిరుద్యోగుల్లో నెలకొంది. అయితే ఇదంతా కేవలం నైపుణ్యాల లోపమే అని సరిపెట్టుకోలేం. లక్షలాది మందికి స్కిల్స్ లేవనడం వాస్తవం కాదు. ఇక్కడ సమస్య ఉద్యోగాల సృష్టిలో కూడా ఉంది. స్థిరమైన వేతనం వచ్చే ఉద్యోగాల కొరత తీవ్రంగా ఉంది. చాలామంది గ్రాడ్యుయేట్లు ఏదో ఒక పని చేస్తున్నా అది వారి చదువుకు ఏమాత్రం సంబంధం లేనిదై ఉంటోంది. ఫుడ్ డెలివరీ చేస్తున్న ఇంజనీర్లు, ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో గడుపుతున్న పీజీ విద్యార్థులే ఇందుకు నిదర్శనం.
చిన్న ఉద్యోగాలకు ఎక్కువ చదువుకున్న వాళ్లు దరఖాస్తు చేయకూడదని చెప్పడం చాలా సులభం. కానీ వారికి సరిపోయే సరైన ఉద్యోగ అవకాశాలు సృష్టించడం చాలా కష్టం. సుప్రీంకోర్టు తీర్పు తక్కువ చదువుకున్న వారి హక్కులను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది ఆధునిక భారతదేశంలో ఉన్న ఒక అతిపెద్ద వైరుధ్యాన్ని బయటపెట్టింది. ఉన్నత చదువులు చదివితే మంచి జీవితం ఉంటుందని నమ్మి యువత ముందుకు సాగింది. కానీ ఇప్పుడు వారు తమ డ్రీమ్ జాబ్ కోసం కాదు.. ఏ చిన్న ఉద్యోగం దొరికినా చాలనుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటప్పుడు చదువుకు తగ్గ ఉద్యోగాలు సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతో ఉంది. లేకపోతే.. అన్నీ చదువుకుని.. అన్నీ సాధించినా ఈ డిగ్రీలు ఎందుకు చదివామా అని యువత నిట్టూర్చే ప్రమాదం ఉంది.
: ఫణి కుమార్ (NTV DIGITAL)
తాజావార్తలు
-
Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
-
EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురి పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?