NTV Telugu Site icon

EPFO News: ఈపీఎఫ్‌ఓలో నమోదవుతున్న ఉద్యోగుల సంఖ్య వరుసగా 3వ నెలా.. తగ్గేదేలా..

Epfo News

Epfo News

EPFO News: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో మూడు నెలల నుంచి ప్రతి నెలా 10 లక్షల మందికి పైగానే ఉద్యోగులు నమోదవుతుండటం విశేషం. ఏప్రిల్‌లో 10 లక్షల 9 వేలు, మే నెలలో 10 లక్షల 7 వేలు, జూన్‌లో 10 లక్షల 54 మందికి పైగా చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. సంఘటిత రంగంలో వరుసగా మూడు నెలల నుంచి ఈ స్థాయిలో ఉపాధి లభిస్తుండటం చెప్పుకోదగ్గ విషయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

‘జీఐసీ’ ఫండ్‌ రైజింగ్‌

బాండ్లను జారీ చేయటం ద్వారా 25 వందల కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించాలని జీఐసీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ భావిస్తోంది. వచ్చే నెల 23వ తేదీన జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు షేర్‌ హోల్డర్ల నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తోంది. మూలధన వనరులను పెంచుకోవటానికి ఈ బాండ్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ బేసిస్‌లో జారీ చేయనుంది.

సీనియర్‌ డైరెక్టర్లు.. లేటెస్ట్‌ సినిమాలు..

ఐటీకి రూ.28 కోట్లు

ఆదాయపు పన్ను విభాగానికి సుమారు లక్ష ఐటీఆర్‌-యు ఫైలింగ్స్‌ దాఖలు కాగా ట్యాక్స్‌ల రూపంలో దాదాపు 28 కోట్ల రూపాయలు సమకూరాయి. ఈ కొత్త ఐటీ రిటర్న్‌ ఫైలింగ్‌ ప్రక్రియను 2022-23 బడ్జెట్‌లో నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ని ప్రవేశపెట్టిందని సీబీడీటీ చైర్మన్‌ నితిన్‌ గుప్తా తెలిపారు.

2 వేలకు పైగా డిలీట్‌

ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య కాలంలో 2 వేలకు పైగా లోన్‌ యాప్‌లను ఇండియా ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ పేర్కొంది. రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరించటం, తప్పుడు సమాచారాన్ని చూపించటం, ఆఫ్‌లైన్‌ బిహేవియర్‌ సరిగా లేకపోవటం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు. రానున్న రోజుల్లో విధానాలపరంగా మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

అదనపు సీట్లు ప్లీజ్‌

రెండు దేశాల మధ్య విమాన ప్రయాణికుల రాకపోకల కోసం మరో 50 వేల సీట్లను అందుబాటులోకి తేవాలని దుబాయ్‌ ఇండియాని కోరింది. తమ విమానాలను ఇండియాలోని మరిన్ని ప్రాంతాలకు అనుమతించాలని కూడా రిక్వెస్ట్‌ చేసింది. భారతీయ విమాన ప్రయాణికులకు దుబాయే పెద్ద గమ్యస్థానం. ఈ నేపథ్యంలో 2014 నుంచి ఇరు దేశాల మధ్య వారానికి 65 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పెంచాలని దుబాయ్‌ తాజాగా అడిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ పెట్టుబడి

గో డిజిట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 9.94 శాతం వాటా కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 120 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ ఇండియాలోని జీవిత బీమా రంగంలో వ్యాపారం నిమిత్తం లైసెన్స్‌ కోసం ఎదురుచూస్తోంది. కెనడాకు చెందిన కామేష్‌ గోయెల్‌ అనే బిలియనీర్‌ దీనికి ప్రమోటర్‌. ఈ సంస్థలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండు విడతల్లో 50 నుంచి 70 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది.

Show comments