Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది. కొవిడ్ సమయంలో ఎస్‌ఈజెడ్ యూనిట్లలో సెంట్‌పర్సెంట్ వర్క్ ఫ్రం హోంకి అనుమతివ్వటాన్ని అందరూ మెచ్చుకున్నారని, సర్వీసుల ఎక్స్‌పోర్టులు సైతం వృద్ధిచెందాయని కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయెల్ గుర్తుచేశారు.
మరింత మందికి మెడి‘కవర్’
హైదరాబాద్‌కి చెందిన మెడికవర్ హాస్పిటల్స్ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ఆసుపత్రులను నిర్మించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో 5 వేల మెడికల్ బెడ్లు ఉండగా ఆ సంఖ్యను వచ్చే ఏప్రిల్‌లోపు 6,500లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు 400 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. మరో మూడేళ్లలో పబ్లిక్ ఇష్యూకి వెళ్లే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇండియాలోనే ఫస్ట్
మన దేశంలో తొలి సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటుకానుంది. ఇండియాలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అనిల్ అగర్వాల్.. తైవాన్‌కి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో కలిసి ఈ ప్లాంటను నిర్మించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నారు. ఈ చిప్ పరిశ్రమను దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయనున్నారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
మన దేశ స్టాక్ మార్కెట్‌లలో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అవి ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 598 పాయింట్లకుపైగా కోల్పోయి 59972 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 298 పాయింట్లు తగ్గి 17771కి దిగొచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో ఆగస్టు నెల అంచనాలను మించిన ద్రవ్యోల్బణం పెరగటంతో ఆ ప్రభావం ప్రత్యక్షంగా అక్కడి మార్కెట్ల పైన, పరోక్షంగా ఇక్కడి మార్కెట్ల పైన పడింది.
