కరోనా ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కరోనా ఎక్కడ తగ్గని పరిస్థితి. ఎప్పుడు.. ఏ దేశంలో.. ఏ వేవ్ మొదలవుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే, తాజాగా తమ దేశంలో కరోనా పూర్తిస్థాయిలో అంతమైపోయిందని ఉత్తరకొరియా వెల్లడించింది. ఈమేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కు లేఖను పంపింది. కరోనా మహమ్మారి వ్యాప్తి పెరిగిపోకుండా ఎన్నో చర్యలు తీసుకున్నామని డబ్ల్యూహెచ్వోకు రాసిన లేఖలో కొరియా పేర్కొంది. పర్యాటకంపై నిషేధం, సరిహద్దులను మూసివేయడంతో ఇది సాధ్యమైందని తెలిపింది. జూన్ 10 నుంచి ఇప్పటిదాకా రోజూ 30 వేల టెస్టులు చేస్తున్నా ఒక్క కేసు కూడా నమోదవలేదని పేర్కొంది. అయితే, ఉత్తరకొరియా వ్యాఖ్యలపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు చాలా హీనంగా ఉన్నాయని.. కేసులను దాచివేస్తూ ఇలా చెప్పుకోవటం సిగ్గుచేటు అని అంటున్నారు.