Xinjiang People Protest Against Covid Restrictions: చైనాలో కరోనా కేసులు మళ్లీ విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వం జీరో కొవిడ్ చర్యలను కఠినంగా పాటిస్తున్న విషయం తెలిసిందే! షింజియాంగ్‌లో లాక్‌డౌన్ విధించడంతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేశారు. అయితే.. ఈ ఆంక్షలపై ఆ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. కొవిడ్ లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ.. షింజియాంగ్ రాజధాని ఉర్ముచీలో పౌరులు భారీ నిరసనలకు దిగారు. గురువారం రాత్రి స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి.. దాదాపు 10 మంది మృతి చెందడం వల్లే, కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా పౌరులు నిరసనలు చేపట్టారు.
దానికితోడు.. కరోనా కఠిన ఆంక్షల వల్లే వాళ్లు బయటకు రాలేక, అగ్నికి ఆహుతి అయ్యారని ఆరోపణలు రావడంతో, పౌరులు మరింత ఆగ్రహానికి గురై ప్రదర్శనలకు దిగారు. పెద్దఎత్తున స్థానికులంతా గుమికూడి.. బారికేడ్లను దాటుకొని వీధుల్లో, ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే.. స్థానిక అధికారులు మాత్రం కరోనా ఆంక్షల వల్లే ఆ పది మంది అగ్నికి ఆహుతయ్యారన్న ఆరోపణల్ని ఖండిస్తున్నారు. ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో కరోనా ఆంక్షలపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో.. దశలవారీగా ఆంక్షలను ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.
కాగా.. ఉర్ముచీ నగరంలో దాదాపు 40 లక్షల జనాభా ఉన్నారు. ఆగస్టు నుంచే ఈ నగరం కొవిడ్ ఆంక్షల గుప్పెట్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆంక్షలను సడలిస్తున్నప్పటికీ.. చైనాలో మాత్రం జీరో కొవిడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కఠిన లాక్‌డౌన్‌లు, క్వారంటైన్ నిబంధనలు అక్కడ అమలవుతన్నాయి. కొవిడ్ ఆంక్షల కారణంగా ఇటీవల ఇద్దరు చిన్నారులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కూడా చైనీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.