China: చైనా సైన్యంలో ఏం జరుగుతోంది..?, వరసగా టాప్ మిలిటరీ అధికారులపై విచారణ ఎందుకు చేపడుతోందనేది ఆసక్తిగా మారింది. చైనా సైన్యంలో అత్యున్నత స్థాయి సైనికాధికారుల్లో ఒకరైన జాంగ్ యౌషియాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కూడా ఇలాగే చాలా మంది సైనికాధికారుల్ని విచారించిన సందర్భంలో కూడా చైనా ‘‘అవినీతి’’ ఆరోపణల్నే ప్రస్తావించింది. విస్తృత అవినీతి నిర్మూలన చర్యల్లో భాగంగానే షి జిన్పింగ్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని అంతా భావిస్తున్నారు.
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సెంట్రల్ మిలిటరీ కమిషన్(CMC) సీనియర్ వైస్ చైర్మన్ జాంగ్ యౌషియా, మరో ఇతర ఉన్నాధికారి లియూ జెన్లీపై ‘‘తీవ్ర క్రమశిక్షణ ఉల్లంఘనల’’కు పాల్పడిన్నట్లు అనుమానంగా ఉందని తెలిపింది. చైనాలో ఈ పదజాలాన్ని సాధారణంగా అవినీతి కేసులకు ఉపయోగిస్తారు.
వీరిద్దరు ఎవరు..?
75 ఏళ్లా జాంగ్ యౌషియా చైనా సైన్యంలో అత్యున్నత ర్యాంక్ కలిగిన అధికారి. సెంట్రల్ మిటరీ కమిషన్ సీనియర్ వైస్ చైర్మన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన శక్తివంతమైన పోలిట్ బ్యూరో సభ్యుడు. CMCలో ఆయన కంటే పై స్థాయిలో ఉన్నది కేవలం అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఒక్కరే. జిన్పింగ్ 2012 నుంచి CMC అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో అధికారి 61 ఏళ్ లియూ జెన్ లీ, CMC జాయింట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ చీఫ్గా ఉన్నారు. ఇది సైనిక యుద్ధ ప్రణాళికలు, ఆపరేషన్లను పర్యవేక్షిస్తుంది.
అవినీతిపై జిన్పింగ్ పోరాటం.!
ఇటీవల జిన్పింగ్ అధ్యక్షతన జరిగిన ఒక కీలక సమావేశంలో వీరిద్దరు కనిపించకపోవడంతో వీరిపై విచారణ జరుగుతోందననే ప్రచారం ఊపందుకుంది. ఈ సమావేశానికి సెకండ్ లెవన్ వైస్ చైర్మన్ జాంగ్ షెంగ్మిన్ హాజరయ్యారు. అవినీతిని కమ్యూనిస్ట్ పార్టీకి పెద్ద ముప్పుగా భావిస్తున్నారు. అయితే, కొందరు మాత్రం తన రాజకీయ ప్రత్యర్థుల్ని అడ్డుతొలగించుకునేందుకే జిన్పింగ్ ఇలా చేస్తున్నారని చెబుతున్నారు.
గత అక్టోబర్ నెలలో 9 మంది సైనికాధికారులపై అవినీతి విచారణ ప్రారంభమైంది. ఇద్దరు అగ్రస్థాయి జనరల్స్ను సైన్యం నుంచి బహిష్కరించారు. 2024లో అప్పటి రక్షణ మంత్రి లీ షాంగ్ఫూను పార్టీ తొలగించింది. ఈయనకు ముందు ఉన్న రక్షణ మంత్రి వే ఫెంగ్హేను కూడా ఇలాగే అవినీతి ఆరోపణల్లో తొలగించారు. ఈ పరిణామాలు చూస్తే చైనా మిలటరీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చైనా సైన్యం, రాజకీయ వ్యవస్థల్లో జిన్పింగ్ తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకుంటున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.