Site icon NTV Telugu

International Kissing Day: ‘ముద్దు’కీ ఓ ప్రత్యేకమైన రోజు.. ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందో తెలుసా?

International Kissing Day

International Kissing Day

ముద్దు అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎవరైనా ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దు పెడుతుంటారు. తల్లీ బిడ్డల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ముద్దు అనేది అన్యోన్యతను పెంచే సాధనం. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, వ్యక్తుల సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ప్రతి ఏడాది జూలై 6వ తేదీన అంతర్జాతీయ ముద్దు దినోత్సవం నిర్వహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం 2000లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ ప్రపంచంలో దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే ముద్దును పొందని వారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే ముద్దుకీ ప్రత్యేకంగా ఓ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

Read Also: Bhagwant Mann: రేపు పంజాబ్ సీఎం రెండో పెళ్లి

మన దేశంలో ముద్దుల దినోత్సవానికి పెద్దగా ప్రాముఖ్యత లేకపోయినా ముద్దు పట్ల భారతీయులు ముద్దుగానే ఉన్నారు. ఆ మాటకు వస్తే ముద్దును ప్రపంచానికి పరిచయం చేసిందే భారతీయులు. క్రీ.శ 1500 కాలంలో భారతీయులు ముద్దులు పెట్టుకునేవారు. ఈ మేరకు వేదాలు, సంస్కృత సాహిత్యాల్లో చుంబన ప్రస్తావనలు కూడా ఉన్నాయి. భారతీయుల ద్వారా యూరోపియన్లు ముద్దులో తియ్యదనాన్ని తెలుసుకున్నారు. అలా ఆ కల్చర్ యూరప్‌కి వెళ్లింది. అక్కడ రోమన్లు, గ్రీకులు కూడా ముద్దుల్లో మునిగితేలారు. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల రిలేషన్ షిప్‌లో ప్రేమ, అనుబంధం పెరగడమే కాకుండా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముద్దు పెట్టుకోవడం ద్వారా ముఖంలోని 34 కండరాలు, శరీరంలోని 112 కండరాలు చురుకుగా పనిచేస్తాయట. అంతేకాకుండా ముఖంలో రక్తప్రసరణ పెరిగి చర్మం యవ్వనంగా, అందంగా కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీకు ఇష్టమైన వారిని ఇప్పుడే ముద్దు పెట్టుకుని ఆరోగ్యంగా ఉండండి.

Exit mobile version