Driverless Car : అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఒక చిన్న పిల్లి మరణం పెద్ద సంచలనంగా మారింది. ప్రాంత ప్రజలందరికీ ఇష్టంగా మెలిగిన ‘కిట్‌క్యాట్’ అనే పిల్లి ఇటీవల ఒక డ్రైవర్ లేని టాక్సీ (రోబోటాక్సీ) కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరి మనసును గెలుచుకున్న కిట్‌క్యాట్‌ను “16వ వీధి మేయర్” అని ప్రేమగా పిలిచేవారు. ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ, షాపుల్లో, రెస్టారెంట్లలో అందరితో మమేకమై ఉండే ఆ పిల్లి అందరికి ప్రత్యేకంగా మారింది. అయితే కొన్ని రోజుల క్రితం అనూహ్యంగా అది రోడ్డు దాటుతుండగా డ్రైవర్ లేని వేమో (Waymo) కంపెనీకి చెందిన రోబోటాక్సీ కింద పడింది. వెంటనే స్థానికులు దానిని సమీపంలోని వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా, వైద్యులు అప్పటికే చనిపోయిందని తెలిపారు.
ఈ దుర్ఘటనతో మొత్తం ప్రాంతం దుఃఖంలో మునిగిపోయింది. స్థానికులు కిట్‌క్యాట్ జ్ఞాపకార్థం పూలతో, దీపాలతో స్మారక స్థూపాలు నిర్మించారు. ప్రతిరోజూ దాంతో ఆత్మీయతగా ఉన్నవారు ఇప్పుడు దాని మరణంతో బాధలో మునిగిపోయారు. ఈ ఘటనతోపాటు రోడ్డుపై తిరిగే జంతువులకు డ్రైవర్ లెస్ వాహనాల వల్ల ప్రమాదం జరగవచ్చని భయాందోళనలు మొదలయ్యాయి. జంతువులే కాకుండా.. రోడ్డుపై చిన్నపిల్లల భద్రత విషయంలో కూడా ఆందోళన లేవనెత్తుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన వేమో సంస్థ, కిట్‌క్యాట్ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. “మా వాహనం ప్రయాణికులను ఎక్కించేందుకు ఆగి ఉన్నప్పుడు, దగ్గరలో ఉన్న పిల్లి అనూహ్యంగా వాహనం కిందికి దూకింది. ఇది చాలా దురదృష్టకరం. ఆ పిల్లిని ప్రేమించిన యజమానికి, కమ్యూనిటీకీ మా సానుభూతి,” అని తెలిపింది. అలాగే, ఆ పిల్లి జ్ఞాపకార్థం స్థానిక జంతు సంరక్షణ సంస్థకు విరాళం ఇచ్చినట్లు ప్రకటించింది. అయితే విరాళం మొత్తం వివరాలు మాత్రం వెల్లడించలేదు.
Bhagavad Gita Controversy: పోలీస్ ట్రైనింగ్లో భగవద్గీత పఠనం.. మధ్యప్రదేశ్లో వివాదం..
ఈ సంఘటన మరోసారి కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వాహనాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, మనిషి, జంతువు, పర్యావరణం మధ్య సమతౌల్యం అవసరం అని నిపుణులు చెబుతున్నారు. కొందరైతే ఇలాంటి ఘటనలు మానవ డ్రైవర్ల వల్ల కూడా తరచూ జరుగుతుంటాయని, కాబట్టి ఇది కేవలం టెక్నాలజీ తప్పు కాదు అని అంటున్నారు. ఇక, ఈ ఘటనతోపాటు నిరాధార జంతువుల సంరక్షణపై కూడా చర్చ మొదలైంది. జంతు పోషక నిపుణురాలు అంజలి కలాచంద్ ప్రకారం, పిల్లులను సంరక్షించాలంటే నిశ్శబ్దంగా, భద్రమైన ప్రదేశాల్లో ఆహారం అందించాలి. పిల్లులకు తడి ఆహారం ఉత్తమమని, అవి ఎక్కువ నీరు తాగవు కాబట్టి వాటి ఆరోగ్యానికి ఇది మంచిదని చెప్పారు.
అలాగే పిల్లుల జనాభా వేగంగా పెరుగుతుందని, కేవలం ఆరు నెలల వయసు నుంచే అవి పిల్లలు పుట్టించగలవని తెలిపారు. కాబట్టి స్పేయింగ్ (జనన నియంత్రణ శస్త్రచికిత్స) చాలా అవసరమని సూచించారు. స్పేయ్ చేసిన పిల్లుల చెవులను కత్తిరించి గుర్తు ఉంచడం, వాటికి రాత్రివేళ నిద్రించేలా పెట్టెలు ఏర్పాటు చేయడం వంటి చిన్న చర్యలతో కూడా వాటి జీవితం రక్షించవచ్చని పేర్కొన్నారు. పిల్లులు స్నేహపూర్వకంగా ఉంటే దత్తతకు ఇవ్వడం మంచిదని, కానీ కొన్ని స్వతంత్ర జీవితం ఇష్టపడతాయని ఆమె పేర్కొన్నారు. చిన్న పిల్లులకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని, తల్లి పాలు తాగడం ఆగిన తర్వాత వాటికి ఇళ్లు కనుగొనడం ఉత్తమమని సలహా ఇచ్చారు.
మొత్తం మీద, కిట్‌క్యాట్ మరణం ఒక నిరాధార జంతువు మృతితో ముగిసిన దుఃఖ ఘట్టమే కాదు, టెక్నాలజీ, మానవ విలువలు, జంతు సంరక్షణ మధ్య సమతౌల్యం అవసరమని గుర్తు చేసే సంఘటనగా నిలిచిపోయింది. మన చుట్టూ తిరిగే జంతువులు కూడా మనలాగే ఈ భూమిపై జీవించడానికి సమాన హక్కు కలిగి ఉన్నాయనే నిజాన్ని ఈ ఘటన మరోసారి మన కళ్ల ముందుకు తెచ్చింది.
SSMB 29 : మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న..? పృథ్వీరాజ్ లుక్ అక్కడి నుంచి వచ్చిందా..!
