Ukraine War: ఏడాదిన్నర కాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించారు. అయితే అమెరికా, యూరప్ దేశాలు ఇస్తున్న సైనిక, ఆయుధ, ఆర్థిక సాయంతో రష్యాను ఎదురించి పోరాడుతోంది ఉక్రెయిన్. అయితే ఈ యుద్ధం ప్రపంచదేశాలకు తలనొప్పిగా మారింది. యుద్ధం వల్ల యూరప్ లోని చాలా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రష్యాపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఆర్థికమాంద్యంలోకి వెళ్తున్నాయి.
Read Also: Kerala: బీజేపీని వీడిన మరో చిత్ర నిర్మాత
ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సమస్యపై చర్చించేదుకు అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ వర్గాలు ప్రకటించాయి. అల్జీరియా దేశాధినేత రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయనతో చర్చల సమయంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది. గతం నుంచి కూడా రష్యా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం పుతిన్ గద్దె దిగితేనే చర్చలంటూ కొత్త పేజీ పెడుతున్నారు.
మరోవైపు రష్యా ప్రస్తుతం ఉన్న భూభాగాన్ని ఉక్రెయిన్ అంగీకరించాలని షరతు పెడుతోంది. ప్రస్తుతం ఉక్రెయిన్ కు సంబంధించిన 18 శాతం భూమి రష్యా ఆధీనంలో ఉంది. డాన్ బాస్, జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్ వంటి ప్రాంతాలు రష్యా హస్తగతం చేసుకుంది. ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైన విధంగా చర్చించడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నట్లుగా ఇంటర్ ఫాక్స్ పేర్కొంది. రష్యా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. తూర్పు, దక్షిణ ఉక్రెయన్ లోని నాలుగు ప్రాంతాలను ఆక్రమించింది. గతంలో 2014లోనే క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది.