NTV Telugu Site icon

Vivek Ramaswamy: భారతీయులకు వివేక్ షాక్.. H-1B వీసా ప్రోగ్రామ్‌ని ముగించాలని వ్యాఖ్యలు..

Vivek Ramaswamy

Vivek Ramaswamy

Vivek Ramaswamy: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 2024లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపధ్యంలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల్లో అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ జరుగుతోంది. ఈ సారి అధ్యక్ష బరిలో ఇద్దరు భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. ఒకరు వివేక్ రామస్వామి కాగా.. మరొకరు నిక్కీహేలి. ఇటీవల వివేక రామస్వామి పలుమార్లు ట్రంపును పొగడటం, తాను అధ్యక్షుడినైతే యూఎస్ క్యాపిటల్ పై దాడులకు పాల్పడిన ట్రంప్ మద్దతుదారులకు క్షమాభిక్ష పెడతానంటూ వార్తల్లో నిలిచారు. దీంతో పాటు ఫెడరల్ ఉద్యోగులను, ఎఫ్బీఐ ఉద్యోగులను తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే వివేక్ రామస్వామి భారతీయులకు షాక్ ఇస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయులు అమెరికాకు వెళ్లేందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్న H-1B వీసాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే తాను వీసా వ్యవస్థలో మార్పులు చేస్తానంటూ హామీలిస్తున్నారు. ముఖ్యంగా H-1B వీసాలను ముగించాలని అనుకుంటున్నాడు. స్వయంగా అమెరికాకు వెళ్లిన వివేక్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అతను ఈ వీసాను 29 సార్లు ఉపయోగించాడు. లాటరీ వ్యవస్థ స్థానంలో మెరిటోక్రాటిక్ ప్రవేశంగా మారుస్తానని చెబుతున్నాడు.

Read Also: Anantnag encounter: “నేను బతకకపోవచ్చు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో”.. చివరిసారిగా భార్యకు వీడియో కాల్..

భారతీయులకే అధికంగా వీసాలు:

H-1B వీసాపై భారతీయ ఐటీ నిపుణులు అమెరికా వెళ్తున్నారు. యూఎస్ కంపెనీలు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిపుణులను అమెరికాలో నియమించుకునేందుకు ఈ వీసాలు ఉపయోగపడుతున్నాయి. ఇండియా, చైనాల నుంచే ఎక్కువ మంది ఈ వీసాలను పొందుతున్నారు. H-1B వీసా వ్యవస్థ చెడ్డదని వ్యాఖ్యానించారు. H-1B వల్ల కేవలం ఆ వ్యక్తిని స్పాన్సర్ చేసిన కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూరుతోందని అంటున్నారు. సరిహద్దును కాపాడుకోవడానికి సైనిక బలగాలను ఉపయోగిస్తానని, అమెరికాలో జన్మించినా, పత్రాలు లేని వలసదారుల పిల్లలనను బహిష్కరిస్తానని కూడా వివేక్ చెప్పారు.

ప్రతీ ఏడాది అమెరికా 65,000 H-1B వీసాలను అందజేస్తుంది. జూలై నెలలో భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి H-1B వీసాలను రెట్టింపు చేయాలని, దీని సంఖ్యను 1,30,000 పెంచాలని బిల్లు ప్రవేశపెట్టాడు. H-1B వీసాలలో దాదాపు నాలుగింట మూడు వంతులు భారతీయ నిపుణులకే అందుతున్నాయి. అయితే వివేక్ రామస్వామి మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వ్యాఖ్యల లాగే వివేక్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.