US-Venezuela: వెనిజులా చమురు విక్రయాలను తామే నియంత్రిస్తామని అమెరికా స్పష్టం చేసింది. అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ఖాతాల్లోనే ఉంచుతామని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ అన్నారు. వెనిజులాకు చెందిన అత్యంత విలువైన వనరైన చమురును ప్రపంచ మార్కెట్‌లోకి ఎలా తీసుకురావాలనే దానిపై అమెరికా క్లారిటీ ఇచ్చింది. బుధవారం మియామీలో జరిగిన గోల్డ్‌మాన్ శాక్స్ సమావేశంలో రైట్ మాట్లాడుతూ.. ప్రస్తుతం, నిల్వగా ఉన్న ముడిచమురును విక్రయిస్తామని అన్నారు. అమెరికా ఆంక్షల వల్ల పేరుకుపోయిన నిల్వల వల్ల ఉత్పత్తి నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇటీవల, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ తర్వాత, ట్రంప్ ప్రభుత్వం వెనిజులా ఆయిల్ పై దృష్టి పెట్టింది. వెనిజులా చమురు రంగంలోకి అమెరికన్ కంపెనీలు ప్రవేశిస్తాయని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ఉత్పత్తిని పెంచుతామని, వీటి ద్వారా వచ్చే డబ్బును వెనిజులా అభివృద్ధికి ఉపయోగిస్తామని ట్రంప్ ప్రభుత్వం చెప్పింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ.. వెనిజులా తన చమురులో సుమారు 50 మిలియన్ బ్యారెళ్లను అమెరికాకు అప్పగిస్తుందని అన్నారు. ప్రస్తుతం, దీని విలువ సుమారుగా 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది.
Read Also: Devendra Fadnavis: ఆ విషయంలో ఢిల్లీ కంటే ముంబై చాలా బెటర్.. ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
అమెరికా ఇప్పటికే వెనిజులా చమురును మార్కెట్ చేయడం ప్రారంభించిందని వైట్ హౌజ్ ప్రతినిధి కరోలిన్ లివిట్ చెప్పారు. ఆ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికా ట్రెజరీలో ఉంచుతామని, ఇది వెనిజులా అప్పుదారుల నుంచి ఆ నిధుల్ని రక్షించడానికి తీసుకున్న చర్యగా యూఎస్ అధికారులు చెబుతున్నారు. తాము ఎవరిని దోచుకోవడం లేదని వెనిజులా చమురును అమ్మి, ఆ డబ్బును వెనిజులా ప్రజలకు ఉపయోగిస్తామని ఇంధన కార్యదర్శి రైట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇదిలా ఉంటే, వెనిజులా చమురు సంస్థ, ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే పెట్రోలియోస్ డి వెనిజులా.. చెవ్రాన్‌తో ఉన్న ఒప్పందం తరహాలోనే అమెరికాతో చమురు విక్రయాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. చెవ్రాన్ ప్రస్తుతం వెనిజులాలో పనిచేస్తున్నా ఏకైక అమెరికా చమురు సంస్థ. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా చమురు ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు చెవ్రాన్, ఎక్సాన్, కానోకోఫిలిక్స్ వంటి సంస్థలను ట్రంప్ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.
