Monkeypox Cases: ప్రపంచాన్ని కరోనా హడలెత్తిస్తున్న వేళ మరో మహమ్మారి భయాందోళనకు గురి చేస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో పలు దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. దీంతో మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. వైరస్ సోకిన వారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికి ఇది సోకుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికాలో కరోనా వైరస్‌తో బాధపడుతోన్న ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న రెండు వైరస్‌లు ఒకేసారి ఒకే వ్యక్తికి సోకడం తొలిసారి అని అగ్రరాజ్యం అధికారులు తెలిపారు.
కాలిఫోర్నియాకు చెందిన మిట్కో థాంప్సన్‌కు జూన్ నెలలో కరోనా వైరస్ బారినపడ్డారు. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పితో బాధపడుతున్న అతనికి శరీరంపై దద్దుర్లు, చిన్నపాటి ఎరుపురంగులో పొక్కులు రావడం మొదలైంది. అనుమానం వచ్చిన ఆ వ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించగా.. పరీక్షించిన వైద్యులు అవి మంకీపాక్స్ లక్షణాలుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ‘నాకు మంకీపాక్స్, కరోనా వైరస్ రెండూ ఉన్నాయని వైద్యులు కచ్చితంగా చెప్పారు.’ అని ఓ ఛానల్‌కు మిట్కో థాంప్సన్ తెలిపారు. అయితే, ఇలా రెండు వైరస్‌లు ఒకేసారి సోకడం చాలా అరుదైన కేసు అని.. వీటిపై మరింత పరిశీలన అవసరమని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 16వేల కేసులు నమోదుకాగా ఐదు మరణాలు సంభవించాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ సోకిన వారికి మంకీపాక్స్ సోకుతోందని వార్తలు వస్తుండటం ఆందోళన కలిగించే విషయమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Monkeypox: ఇండియాలో మరో మంకీపాక్స్ కేసు.. ట్రావెల్ హిస్టరీ లేని వ్యక్తిలో వైరస్ గుర్తింపు
ప్రపంచానికి మంకీపాక్స్ ను పెనుముప్పుగా డబ్ల్యూహెచ్ఓ పరిగణిస్తోంది. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా డబ్ల్యూహెచ్ఓ కీలక చర్యలు తీసుకోనుంది. అయితే గత నెలలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీపాక్స్ ను ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ఓ నిరాకరించింది.. అయితే గత వారం నుంచి గణనీయంగా కేసుల సంఖ్య పెరగడంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో 16,000 పైగా కేసులు నమోదు అయ్యాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు ఏకంగా కేసుల సంఖ్య 77 శాతానికి పెరిగింది. ఇటీవల భారత్ లో కూడా మూడు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ కంట్రీస్ నుంచి కేరళకు వచ్చిన ముగ్గురిలో వైరస్ ను గుర్తించారు.యూకేలో ప్రారంభం అయిన మంకీపాక్స్ కేసులు క్రమంగా యూరోపియన్ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాల్లో కూడా కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క యూరపియన్ దేశాల్లోనే 86 శాతానికి పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో 11 శాతం కేసులు ఉన్నాయి. ఇటీవల పలు అధ్యయనాల్లో 95 శాతం కేసులు శృంగారం ద్వారానే సంక్రమిస్తుందని తేలింది.
డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన వ్యాధులు ఇవే…
అమెరికాలో ఇప్పటి వరకు 2,400 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఇద్దరు పిల్లల్లో మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ఈ వైరస్ సన్నిహితంగా మెలిగిన వారికి సోకుతుంది. ఫ్లూ, శరీరంపై బొబ్బల వంటి లక్షణాలు కనిపిస్తాయి. అమెరికాలో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బీఏ5 వేరియంట్ వేగంగా విజృభిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. జులై 19న అత్యధికంగా ఒక్క రోజే 1.7 లక్షల కేసులు వచ్చాయి.