NTV Telugu Site icon

USA: అమెరికా మారదు.. పాకిస్తాన్‌తో కలిసి పనిచేస్తామంటూ ప్రకటన

Pak Usa Relations

Pak Usa Relations

US Looks Forward To Continue Working With Pakistan: అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహకరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది. ఎఫ్ఏటీఎఫ్ నుంచి బయటపడేందుకు కూడా అమెరికా, పాకిస్తాన్ కు సహకరించింది.

తాజాగా పాకిస్తాన్ తో కలిసి పనిచేసేందుకు అమెరికా ఎదురుచూస్తోందని ఆ దేశం ప్రకటించింది. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ కీలకం అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అన్నారు. పాక్ ఆర్మీ కొత్త చీఫ్ గా అసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకున్న సమయంలో అమెరికా బుధవారం ఈ వ్యాఖ్యలను చేసింది. పాకిస్తాన్‌తో మా దీర్ఘకాల సహకారాన్ని విలువైనదిగా భావిస్తోందని, సంపన్నమైన, ప్రజాస్వామ్య పాకిస్తాన్ అమెరికా ప్రయోజనాలకు కీలకం అని కరీన్ జీన్ పియర్ అన్నారు. పాకిస్తాన్ లో ప్రజలకు సుస్థిరత, శ్రేయస్సును ప్రోత్సహించడానికి పాకిస్తాన్‌తో కలిసి పని చేయడం కొనసాగించడానికి మేము ఎదురుచూస్తున్నామని అన్నారు.

Read Also: Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఘాతుకం.. రూ.1.9 కోట్ల కోసం భార్య హత్య..

గత నాలుగేళ్ల తరువాత మళ్లీ అమెరికా-పాకిస్తాన్ బంధం బలపడుతోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడానికి సహాయపడేందుకు అమెరికా 450 మిలియన్ డాలర్లలో ఎఫ్-16 ఫైటర్ జెట్లను అమ్మడానికి డీల్ కుదుర్చుకుంది. దీనికి ఇప్పటికే ప్రెసిడెంట్ బైడెన్ ఆమోదం తెలిపాడు. గతంలో పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 2018లో ఆఫ్ఘన్ తాలిబన్లను, హక్కానీ నెట్ వర్క్ ను అణచివేయడంతో పాకిస్తాన్ ఉదాసీనత చూపించడంతో అమెరికా అందిస్తున్న 2 బిలియన్ డాలర్ల భద్రతా సాయాన్ని నిలిపివేసింది. కానీ ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకం అని చెబుతున్నప్పటికీ అమెరికా అందిస్తున్న సాయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ వ్యతిరేకతకే ఖర్చు పెడుతోంది. కేవలం ఎఫ్-16 విమానాలను ఉగ్రవాదులపై ఉపయోగించాల్సి ఉన్నా.. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా వాడింది. భారత్ పై దాడి చేస్తున్న క్రమంలో అభినందన్ వర్థమాన్ తన మిగ్ బైసన్ యుద్ధవిమానంతో అత్యాధునిక ఎఫ్-16 ఫైటర్ జెట్ ను కూల్చాడు. ఈ సమయంలో అమెరికా, పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.