Site icon NTV Telugu

US-Israel-Iran Tensions: బాంబులు.. క్షిపణులు.. యుద్ధాలు..! భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు.. మరణాలు పెరుగుతాయా?

Iranwar

Iranwar

Climate Crisis in War Zones: బాంబులు పేలుతున్నాయి.. క్షిపణులు దూసుకెళ్తున్నాయి.. యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తున్నాయి. ప్రపంచం మాత్రం ఇప్పటికీ యుద్ధాల మానవ నష్టాలనే లెక్కిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం పెద్దగా చర్చలోకి రావడం లేదు. అదే యుద్ధాల వల్ల భూమి వాతావరణానికి జరుగుతున్న నష్టం. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి ఘర్షణలు కేవలం రాజకీయ లేదా భౌగోళిక ప్రభావాలకే పరిమితం కావడం లేదు. ప్రతి క్షిపణి ప్రయోగం, ప్రతి యుద్ధ విమాన ప్రయాణం భారీగా ఇంధనాన్ని కాల్చి వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను పెంచుతోంది.

యుద్ధాల వల్ల ఎంత కాలుష్యం?
యుద్ధం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంఖ్యలే చాలు. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఇజ్రాయెల్-గాజా యుద్ధం మొదటి 120 రోజుల్లోనే విడుదలైన కార్బన్ ఉద్గారాలు 26 దేశాల వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు యుద్ధంలో ధ్వంసమైన భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికి అవసరమైన ఉద్గారాలను కూడా కలిపితే అది 135 దేశాల వార్షిక కార్బన్ ఉద్గారాలకు సమానం అని నివేదికలు చెబుతున్నాయి.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇదే స్థాయిలో పర్యావరణ ప్రభావం చూపింది. యుద్ధం మొదలైన తర్వాత మూడు సంవత్సరాల్లోనే సుమారు 230 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆస్ట్రియా, హంగరీ, చెక్ రిపబ్లిక్, స్లోవాకియా దేశాల మొత్తం వార్షిక ఉద్గారాలకు సమానం. ఇందులో ట్యాంకులు, ఫైటర్ జెట్స్, భారీ తుపాకుల వినియోగం మాత్రమే కాకుండా యుద్ధం కారణంగా జరిగిన అడవి అగ్నిప్రమాదాలు కూడా పెద్ద పాత్ర పోషించాయి.

క్లైమేట్ రిపోర్టుల్లో లెక్కలే లేవు:
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భారీ ఉద్గారాల్లో చాలా వరకు అధికారిక క్లైమేట్ రిపోర్టుల్లో కనిపించవు. పారిస్ క్లైమేట్ ఒప్పందం ప్రకారం సైనిక కార్యకలాపాల వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలను నివేదించడం తప్పనిసరి కాదు. అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు భారీగా కార్బన్ విడుదల అయినా కూడా అవి చాలా వరకు ప్రపంచ క్లైమేట్ లెక్కల్లో చేరవు.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ప్రమాదం:
ప్రస్తుతం ప్రపంచ దృష్టి మధ్యప్రాచ్యంపై ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లు, ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిపై దాడులు జరిగితే కేవలం కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాదు.. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, విషపూరిత కణాలు కూడా వాతావరణంలోకి విడుదల అవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన ఇరాన్‌లోని సౌత్ పార్స్ ప్రాంతం కూడా ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. అక్కడ పెద్ద స్థాయి దాడి జరిగితే పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌పై కూడా ప్రభావం:
ఈ పరిస్థితుల్లో భారత్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత్ వినియోగించే క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 85 శాతం దిగుమతులే.. అందులో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. అక్కడ సరఫరా అంతరాయం ఏర్పడితే భారత్ మళ్లీ బొగ్గు వినియోగం వైపు వెళ్లే అవకాశం ఉంది. అయితే బొగ్గు అత్యధిక కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే ఇంధనం కావడంతో ఇది భారత్ క్లైమేట్ లక్ష్యాలను కూడా ప్రభావితం చేయవచ్చు.

ఇక యుద్ధాలు పూర్తిగా ఆగిపోవడం కష్టం. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచం ముందుంది. యుద్ధాల వల్ల భూమి వాతావరణానికి జరిగే నష్టాన్ని ఎందుకు అధికారికంగా లెక్కలోకి తీసుకోవడం లేదు? ఎందుకంటే ఒకసారి అది లెక్కలోకి వస్తే యుద్ధాల అసలు ఖర్చు ఎంత పెద్దదో ప్రపంచం గుర్తించాల్సి వస్తుంది.

Exit mobile version