Monkeypox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇంకా కరోనా సమస్య తొలగిపోకముందే ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో రోజురోజుకూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రపంచదేశాలను వణికిస్తున్న మంకీపాక్స్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మహమ్మారిపై పోరాటం కోసం ఎక్కువ నిధులు కేటాయించడమే గాక, సమాచార సేకరణ కోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకుని ప్రజలు తమకు సహకరించాలని అమెరికా ఆరోగ్య శాఖ కోరింది. “ఈ మంకీపాక్స్ వైరస్‌ను పరిష్కరించడంలో మా ప్రతిస్పందనను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మంకీపాక్స్‌ను తీవ్రంగా పరిగణించాలని, ఈ వైరస్‌ను ఎదుర్కోవడంలో మాకు సహాయపడటానికి బాధ్యత వహించాలని మేము ప్రతి అమెరికన్‌ను కోరుతున్నాము” అని అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి జేవియర్ బెకెరా తెలిపారు.
Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
మంకీపాక్స్ నియంత్రణకు తాను కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. టీకా పంపిణీ వేగవంతం చేసి పరీక్షల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఈ వైరస్ వల్ల ముప్పును ప్రజలకు తెలియజేస్తామన్నారు. అందుకే మంకీపాక్స్‌ను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినట్లు తెలిపారు. వైరస్‌పై పోరాటంలో ఇది చాలా కీలకమన్నారు. అమెరికాలో సుమారు 6600 కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో మూడో వంతు కేసులు న్యూయార్క్‌లో బయటపడ్డాయి. ఆ రాష్ట్రం సొంతంగా ఎమర్జెన్సీ ప్రకటించుకుంది. కాలిఫోర్నియా, ఇలియాస్‌లోనూ అధిక కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 26వేల కేసులు నమోదు అయినట్లు అమెరికా అంటువ్యాధుల సంస్థ సీడీసీ చెప్పింది. యూఎస్‌లో 99 శాతం కేసులు ఇప్పటివరకు పురుషులతో లైంగిక సంబంధం కలిగి ఉన్న పురుషులలో ఉన్నాయని ఆరోగ్య, మానవ సేవల విభాగం గత వారం తెలిపింది ఈ మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.