Site icon NTV Telugu

US-China Trade War: అమెరికాకు కీలక లోహాలు, అయస్కాంతాల ఎగుమతిని నిలిపేసిన చైనా..

Us China Trade War

Us China Trade War

US-China Trade War: అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు భారీ సుంకాలను విధించుకుంటున్నారు. తాజాగా, చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, లోహాలు, అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా నిలిపేసింది. ఇవి ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమేకర్లు, ఏరోస్పేస్ తయారీదారులు, సెమీకండక్టర్‌ల తయారీలో విస్తృతంగా వినియోగిస్తారు.

చైనా ప్రభుత్వం ఎగుమతుల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థ, విధానాలను రూపొందిస్తోందని, కార్ల నుంచి క్షిపణుల దాకా అన్నింటి తయారీకి అవసరమయ్యే అయస్కాంతాల ఎగుమతుల్ని నిలిపేసినట్లు, అనేక చైనా ఓడరేవుల్లో షిప్‌మెంట్స్ ఉన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక తెలిపింది. నివేదికల ప్రకారం, కొత్త నియంత్రణ వ్యవస్థ అమలులోకి వచ్చిన తర్వాత అమెరికన్ మిలిటరీ కాంట్రాక్టర్లతో సహా అన్ని కంపెనీలకు వస్తువులు చేరకుండా శాశ్వతంగా నిరోధించవచ్చని తెలుస్తోంది.

చైనా దిగుమతులపై ఆధారపడిన యూఎస్..

అమెరికా చాలా వరకు చైనా దిగుమతులపై ఆధారపడింది. దీంతో చైనా ట్రంప్ సుంకాలకు ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. చైనా ప్రపంచంలోనే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌లో దాదాపుగా 90 శాతం ఉత్పత్తిని కలిగి ఉంది. ఇది రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. రేర్ ఎర్త్ మూలకాల్లో 17ఉన్నాయి. సమారియం, గాడోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, యట్రియం-సంబంధిత వస్తువులతో సహా ఏడు వర్గాల మధ్యస్థ, భారీ అరుదైన ఎర్త్‌లను ఎగుమతి నియంత్రణ జాబితాలో ఉంచారు.

అమెరికా వద్ద కేవలం ఒకే ఒక్క రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని వెలికి తీసే గి ఉంది. ఎక్కువ మొత్తాన్ని చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ట్రంప్ చైనా ఉత్పత్తులపై 54 శాతం సుంకాలను విధించాలనే నిర్ణయానికి ప్రతీకారంగా చైనా ఏప్రిల్ 02 నుంచి అదురైన ఎర్త్ మూలకాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

అమెరికాకు ఇవి ఎందుకు కీలకం:

ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోలు, క్షిపణులు, అంతరిక్ష నౌకలు, ఇంధనంతో నడిచే కార్ల తయారీతో పాటు, ఎలక్ట్రిక్ మోటార్లకు ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా కీలకం. ఈ లోహాలను జెట్ ఇంజన్లు, లేజర్‌లు, కార్ హెడ్‌లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్‌లు మరియు కెపాసిటర్‌ల తయారీకి అవసరం. ఇవి కొన్ని ఏఐ సర్వర్లు, స్మార్ట్‌ఫోన్లలోని కంప్యూటర్ చిప్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.

Exit mobile version