United Airlines joins Pfizer, Audi in move to suspend Twitter ads amid Musk takeover: ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్ మస్క్ కు షాకులు తప్పలా లేవు. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుపై కొంత మంది అమెరికన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునేందుకు ఎలాన్ మస్క్ సగం మందికి ఉద్వాసనలు పలికేందుకు సిద్ధం అయ్యారు. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే ప్రారంభం అయింది. మరోవైపు ట్విట్టర్ టేకోవర్ తరువాత సీఈఓ పరాగ్ అగర్వాల్ తో పాటు మరో భారతీయ ఉద్యోగి, పాలసీ చీఫ్ విజయగద్దెలతో పాటు మరికొంత మంది కీలక ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్ బోర్డును రద్దు చేసి ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటే మస్క్ నిర్ణయాలపై పలు అంతర్జాతీయ కంపెనీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్ హస్తగతం తరువాత ‘‘ వాక్ స్వాతంత్య్రం’’ కల్పిస్తానని మస్క్ హామీ ఇవ్వడంతో ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో గత వారం నుంచి ద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం పెరిగింది. దీంతో ట్విట్టర్ లో యాడ్స్ ఇస్తున్న కొన్ని కంపెనీలు ఈ వ్యవహారంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్, ప్రముఖ కంపెనీలు ట్విట్టర్ లో యాడ్స్ నిలిపివేశాయి. తాజాగా అమెరికాలోని ప్రధాన ఎయిర్‌లైన్ ఆపరేటర్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ట్విట్టర్ లో తన ప్రకటనలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు ఇదే విధంగా కొన్ని కంపెనీలు ట్విట్టర్ లో ప్రకటనలు నిలిపివేశాయి.
Read Also: Twitter: నా ఉద్యోగం పోయింది.. భారతీయుడి ట్వీట్ వైరల్
ట్విట్టర్ లో ప్రకటనలు నిలిపివేసిన ప్రముఖ కంపెనీలో ప్రపంచ ఆటోమేకర్ దిగ్గజం ఆడితో పాటు ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఫైజర్, ఆహార తయారీదారు జనరల్ మిల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కూడా చేరింది. మరికొన్ని కంపెనీలు ట్విట్టర్ వ్యవహారంపై వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం యాంటీ డిఫమేషన్ లీగ్, ట్విట్టర్ తో సంబంధాలను నిలిపివేయాలని పలు కంపెనీలకు సూచించింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు అపరిమిత అవకాశాలు కల్పిస్తే ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారానికి దారి తీస్తుందని చాలా మంది భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే గతంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో యూఎస్ క్యాపిటల్ పై దాడికి కారణం అయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్విట్టర్ నిషేధించింది. అయితే ట్విట్టర్ ను టేకోవర్ చేసిన మస్క్ మళ్లీ డొనాల్డ్ ట్రంపును ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలు కంపెనీలు యాడ్స్ ఇవ్వడానికి జంకుతున్నాయి. ట్విట్టర్ ఆదాయంలో 90 శాతం ప్రకటన ద్వారానే వస్తోంది. డిజిటల్ మార్కెటింగ్ కోసం ట్విట్టర్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే డిజిటల్ ప్రకటనల్లో గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ దాదాపుగా 75 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022లో ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ యాడ్స్ లో కేవలం 0.9 శాతం ట్విట్టర్ కు వస్తున్నాయి. 21.4 శాతం ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా ఉంది.