NTV Telugu Site icon

Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్‌ని వణికిస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)పై సైనిక చర్యలకు ఆ దేశం సిద్ధమైంది. పాకిస్తాన్‌లో అత్యంత పెద్దదైన బలూచిస్తాన్ ప్రావిన్సుని స్వతంత్ర దేశంగా మార్చాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ వేర్పాటువాద గ్రూపుపై సైనిక దాడిని ప్రారంభించే ప్రణాళికను పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా దాడులు పెరగడంపై, ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్తాన్ భద్రతా పరిస్థితిని చర్చించడానికి మంగళవారం ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో సివిల్, మిలిటరీ అధికారులతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సమావేశాన్ని నిర్వహించారు.

బలూచిస్తాన కేంద్రంగా పనిచేస్తున్న మజీద్ బ్రిగేడ్ (ఆత్మహత్య దళం), బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF), మరియు బలూచ్ రాజీ ఆజోయ్ సంగర్ (BRAS)తో సహా బలూచిస్తాన్‌లో పనిచేస్తున్న తీవ్రవాద సంస్థలపై సమగ్ర సైనిక చర్యను పాక్ ప్రభుత్వం ఆమోదించింది. పాక్ పౌరులతో పాటు విదేశీ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని దేశంలో అభద్రతా భావం సృష్టించేందుకు శత్రు బాహ్య శక్తుల ఆదేశంతో ఈ సంస్థలు పనిచేస్తూ, దేశ ఆర్థిక పురోగతిని దెబ్బ తీస్తున్నాయని పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానికి షరీఫ్ కేబినెట్ సభ్యులు, ప్రావిన్షియల్ సీఎంలు, త్రివిధ సాయుధ సర్వీసుల చీఫ్‌లు హాజరయ్యారు.

Read Also: Gautam Adani: ట్రంప్‌కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?

విస్తీర్ణంలో అతిపెద్ద ప్రాంతం, అతి తక్కువ జనాభా కలిగిన ప్రాంతంగా బలూచిస్తాన్‌కి పేరుంది. ఈ ప్రావిన్సులో అపారమైన ఖనిజ, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. వీటిని దోచుకుంటున్న పాక్ ప్రభుత్వానికి, చైనాకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని బలూచిస్తాన్ వేర్పాటువాదులు చెబుతున్నారు. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు కలుగజేస్తుందని పాక్ ఆరోపిస్తోంది.

ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) వెళ్తోంది. ఈ ప్రాంతంలోని గ్వాదర్ పోర్టుని, చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్సును కలుపుతూ రోడ్లు, రైలు మార్గాలను నిర్మిస్తున్నారు. తరుచుగా బీఎల్‌ఏ, ఇతన వేర్పాటువాద సంస్థలు ఈ ప్రాజెక్టులపై దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా అందులో పనిచేస్తున్న చైనా వ్యక్తుల్ని, పాక్ ఆర్మీ, పోలీసుల్ని టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహిస్తోంది. ఒకానొక దశలో చైనా తమ పౌరుల భద్రతపై పాకిస్తాన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా ఈ దాడుల్ని తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగుతోంది.

Show comments