లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఏకధాటిగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాకెట్లు బీరుట్‌ను తాకినప్పుడు యూఎన్ కార్యాలయం సమీపంలో పడ్డాయి. ఈ పరిణామాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్ర పరిణామంగా పరిగణించింది. తమ ఆస్తుల భద్రతకు హామీ ఇవ్వాలని యూఎన్ సిబ్బంది కోరారు.
భారత్ ఖండన..
దక్షిణ లెబనాన్‌లోని ఐరాస శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు జరగడం ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అభిప్రాయపడింది. ‘‘లెబనాన్ సరిహద్దులో భద్రతా పరిస్థితులు క్షీణించడంపై ఆందోళనకరం. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐరాస ప్రాంగణాలను అందరూ గౌరవించాలి. ఐరాస శాంతి పరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘పశ్చిమాసియాలో నెలకొంటున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశాం. అక్కడ చోటుచేసుకుంటున్న హింస, పరిస్థితులు ఎంతగానో ఆందోళన కలిగిస్తున్నాయి. సంబంధిత భాగస్వామ్యపక్షాలు సంయమనం పాటించాలని, పౌరులకు రక్షణ కల్పించాలని పునరుద్ఘాటించాం. ఈ ఘర్షణ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకూడదు. చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cow’s Milk For Childrens: మీ పిల్లలకు ఆవు పాలు ఇస్తున్నారా? చాలా ప్రమాదం..