Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ దారుణంగా దెబ్బతింటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ లోని చాలా భాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్ సర్వనాశనం అవుతున్నాయి. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలు రష్యా క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం రష్యా 70కి పైగా మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.
రష్యా భారీగా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, తాగు నీటి సదుపాయాల వంటి మౌళిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది రష్యా. దీంతో ఉక్రెయిన్ వ్యాప్తంగా చాలా పట్టణాలు, నగరాల్లో అంధకారం ఏర్పడింది. విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా శ్రమిస్తోంది. రాజధాని కీవ్ తో పాటు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రాజధాని కీవ్ లక్ష్యంగా దాడులు చేస్తోంది రష్యా. సోమవారం తెల్లవారుజామున కీవ్ పై డ్రోన్లతో దాడులు చేసింది రష్యా.
Read Also: Pathan Controversy: పఠాన్ వివాదం.. ప్రవక్తపై మధ్యప్రదేశ్ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం శీతాకాలం కావడంతో రష్యా వ్యూహాత్మకంగా యుద్ధం చేస్తోంది. విద్యుత్ గ్రిడ్స్ లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో ప్రజలు శీతాకాలం నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న హీటర్ల వ్యవస్థ పనిచేయడం లేదు. వేడినీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. శీతాకాలం నుంచి రక్షించుకునేందుకు ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాలని రష్యా ఇలా చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ దేశాలు పౌర, మౌళిక వ్యవస్థలపై దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. తీవ్రంగా దెబ్బతిన్న విద్యుత్ గ్రిడ్ ను రిపేర్ చేయడానికి దేశవ్యాప్తంగా విద్యుత్ బ్లాక్ అవుట్ విధించాల్సి వచ్చింది. శీతాకాలంలో అత్యవసర సహాయం కింద 1 బిలియన్ యూరోలు ఇస్తామని ఉక్రెయిన్ మిత్రదేశాలు హామీ ఇచ్చాయి. అయితే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
