Ukraine President Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రమాదానికి గురయ్యారని, అయితే ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన ప్రతినిధి తెలిపారు. రాజధాని కీవ్ నగరంలో భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. జెలెన్స్కీ ప్రయాణిస్తున్న వాహనాన్ని కీవ్ గుండా వెళుతుండగా వాహనదారుడు ఢీకొన్నాడని.. అయితే ఈ ప్రమాదంలో అధ్యక్షుడికి పెద్దగా గాయాలు కాలేదని ఆయన ప్రతినిధి గురువారం తెల్లవారుజామున తెలిపారు.
ఎదురుగా వస్తున్న ఓ కారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న కారును, పక్కనున్న కాన్వాయ్‌ను ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే ఆంబులెన్స్‌తో అధికారులు అక్కడికి చేరుకున్నారు. జెలెన్‌స్కీని, ఆయన కారు డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో జెలెన్‌స్కీకి, డ్రైవర్‌కు తీవ్రగాయాలేవీ కాలేదని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో జెలెన్‌స్కీకి ఈ కారు ప్రమాదం జరగడంతో ఆ దేశంలో ఆందోళన నెలకొంది. అధ్యక్షుడు తీవ్రంగా గాయపడనప్పటికీ.. జెలెన్‌స్కీ ఆరోగ్యంపై అధ్యక్ష కార్యాలయం పూర్తి స్థాయి హెల్త్ బులెటెన్ విడుదల చేయాల్సి ఉంటుంది.
Jammu Kashmir: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఇది రోడ్డు ప్రమాదమేనా? లేదంటే కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ఎదురుగా వచ్చిన కారులోని వ్యక్తులు పరారు కావడంతో.. వాళ్లను పట్టుకునే పనిలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఖార్కీవ్ ప్రాంతంలో రష్యా బలగాలు వెనక్కి మళ్లాయంటూ జెలెన్‌స్కీ బుధవారం రాత్రి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియో చేసిన కాసేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.