ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారుతోంది. ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అక్కడి పౌరులు, పార్లమెంటు సభ్యులు కూడా యుద్ధానికి మేం రెడీ అంటున్నారు. ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు, మహిళా ఎంపీ కిరా రుడిక్ తానూ యుద్ధం చేస్తానంటూ ఆయుధం చేతబట్టారు. ఈ మేరకు ఆమె చాలామందిలాగే తాను కూడా రష్యా దాడిని ఎదుర్కొని తన దేశాన్ని, ప్రజలను రక్షించడానికి కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని తీసుకున్నానని అన్నారు. అంతేకాదు ఈ ఆయుధాన్ని ఉపయోగించడం నేర్చుకోవడమే కాక ధరించేందుకు సిద్ధమవుతున్నానని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
రష్యా సైనికుల ప్రవేశాన్ని ఉక్రెయిన్ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశరక్షణకు మహిళలు పురుషులు అనే భేధం వుండదని, ఈ దేశాన్ని రక్షించుకుంటారని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను చాలా కోపంగా ఉన్నానని చెప్పారు. అయినా పుతిన్ ఉక్రెయిన్ ఉనికి హక్కును ఎలా తిరస్కరిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదనగా అన్నారు. తనని తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని అయినప్పటికీ తాను రాజధాని కైవ్‌లోనే ఉంటూ తన కుటుంబాన్ని తన దేశాన్ని రక్షించుకుంటానని ఆమె చెబుతున్నారు. తన తోటి శాసనసభ్యులతో సహా అనేక మంది ఉక్రేనియన్ మహిళలు రష్యా దళాలతో పోరాడేందుకు ఆయుధాలు తీసుకున్నారని ఉక్రెయిన్ ఎంపీ చెప్పుకొచ్చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ఊహకు కూడా అందని విధంగా తాము ప్రతిఘటిస్తాం అన్నారు. ఉక్రెయిన్ రాజధాని కాదు కదా మా గడ్డ మీద ప్రతి అంగుళాన్ని వారికి దక్కనివ్వకుండా మా దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌లోని ప్రతి స్త్రీ, పురుషుడు సిద్ధంగా ఉన్నారని కిరా రుడిక్ అంటున్నారు. పుతిన్ తమ బలగాలను వెనక్కి రప్పిస్తాడని ఆశిస్తున్నామని రుడిక్ తెలిపారు. మొత్తం మీద ఉక్రెయిన్ పై రష్యా దాడి ఆదేశ పౌరుల పోరాట పటిమకు అద్దం పడుతోంది. దేశం కోసం ఏమైనా చేస్తామని వారంటున్నారు.