Site icon NTV Telugu

Ukraine Crisis: ఉక్రెయిన్ ఎదురుదాడి.. రష్యా ఫైటర్ జెట్స్ కూల్చివేత

రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. తమ దేశంలోని ప్రవేశించి దాడులకు దిగుతున్న రష్యా జెట్ ఫైటర్‌ను ఉక్రెయిన్ కూల్చివేసింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాఫ్ట్, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. తమ దేశ భ‌ద్ర‌త కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడ‌తార‌ని ఉక్రెయిన్ ప్ర‌భుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్ స్ట్రైక్స్‌తో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది. ఆ దేశ సరిహద్దుల్లో సుమారు 1.50 లక్షల మంది సైనికులు మోహరించారు. మరోవైపు బెలారస్ సైనికులు కూడా రష్యా దళాలతో చేరారు.

ఈ నేప‌థ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవతా దృక్పథంతో యుద్ధాన్ని ఆపాలని రష్యాను ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఉక్రెయిన్‍లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధానంగా రాజధాని కీవ్‍ను విడిచి ప్రజలు పారిపోతున్నారు. ఉక్రెయిన్‍లో ప్రముఖులు, రాజకీయ నాయకులు బంకర్లలో తలదాచుకొని ప్రాణాలు రక్షించుకుంటున్నారు

Exit mobile version