ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే బాంబులతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యాకు ఫైటర్ జెట్‌లు ఉక్రెయిన్ భూతలంలోకి ప్రవేశించిన బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని, మోదీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా వినే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే మోదీ అత్యంత శక్తిమంతమైన నాయకుడు అని, ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని వివరించారు. మోదీ వెంటనే స్పందించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడాలని పొలిఖా విజ్ఞప్తి చేశారు. పుతిన్ ఎవరి మాట వినకపోయినా మోదీ మాట వింటారన్న నమ్మకం ఉందని ఆయన వివరించారు.