UK-Iran: ఐఆర్‌జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన

  • ఐఆర్‌జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం
  • ఉగ్ర సంస్థగా ప్రకటన
  • జాతీయ ప్రయోజనాల కోసమేనని వెల్లడి
Ukiran

Ukiran

ఇరాన్‌కు బ్రిటన్ బిగ్ షాకిచ్చింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఐఆర్‌జీసీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా నేరంగా పరిగణించింది. ఈ పరిణామంతో ఇరాన్-ఐరోపా దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని యూకే నిర్ణయించింది. ఈ నిర్ణయం తర్వాత యూకేలో ఐఆర్‌జీసీకి మద్దతు ఇవ్వడం నేరంగా పరిగణించబడుతుంది. ఈ సంస్థను నిషేధించడంపై బ్రిటన్‌లో చాలాకాలంగా జరుగుతున్న రాజకీయ చర్చల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను సమీక్షించిన తర్వాత యూకే జాతీయ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాల్లో ఐఆర్‌జీసీ పాలుపంచుకుందని నిర్ధారణకు వచ్చినట్లు యూకే హోం ఆఫీస్ పేర్కొంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నిర్ణయం అవసరమని ప్రభుత్వం తెలిపింది.

ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ది కంపానియన్స్ ఆఫ్ ది రైట్ (IMCR), రష్యన్ ఫెడరేషన్ వాలంటీర్ కార్ప్స్‌లను కూడా తమ నిషేధిత సంస్థల జాబితాలో చేర్చనున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకారం.. బ్రిటన్‌లోని యూదు లక్ష్యాలపై జరిగిన దాడులతో IMCRకు సంబంధం ఉండగా.. రష్యన్ ఫెడరేషన్ వాలంటీర్ కార్ప్స్‌ను రష్యన్ సైనిక గూఢచార సంస్థతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా అభివర్ణించారు.

బ్రిటన్ గడ్డపై ఇరాన్‌కు సంబంధించిన భద్రతాపరమైన ముప్పులు, కుట్రల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ ఇంటర్నేషనల్ టెలివిజన్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై జరిగిన హత్యాయత్నం, బ్రిటీష్ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ దాడులు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ ఘటనలు బ్రిటీష్ భద్రతా సంస్థలలో ఆందోళనలను రేకెత్తించాయి. అందుబాటులో ఉన్న అన్ని సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి.. చట్టపరమైన సమీక్ష జరిపిన అనంతరం ఈ సంస్థల కార్యకలాపాలు విదేశీ శక్తులతో ముడిపడి ఉన్న భద్రతా ముప్పును కలిగిస్తున్నాయని హోం ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది. యూకే భద్రతను కాపాడటానికి, పౌరులను రక్షించడానికి, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి వాటిని నిషేధించడం అవసరమని పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇరాన్ వార్తాపత్రికలో 13 మంది హిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో యూకే ప్రధాని కీర్ స్టార్మర్ పేరు కూడా ఉంది. అమెరికా, ఐరోపా నేతలను టార్గెట్ చేసుకుని జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వార్త అంతర్జాతీయంగా సంచలనంగా మారింది.