NTV Telugu Site icon

Pakistan: పాక్ ఆర్థిక సంక్షోభం.. 20-25 బిలియన్ డాలర్లు పెట్టేందుకు యూఏఈ సిద్ధం..

Pakistan

Pakistan

Pakistan: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఆదుకునేందుకు యూఏఈ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్‌లో యూఏఈ 20-25 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వారుల్ హక్ కకర్ సమావేశమైన తర్వాత ఈ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఇంధనం, పోర్ట్ కార్యకలాపాలు, మురుగునీటి శుద్ధి, ఆహార భద్రత, లాజిస్టిక్స్, మైనింగ్, విమానయానం మరియు బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలతో సహా వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఇరు దేశాలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ ఎంఓయూల ఖచ్చితమైన సమచారం తెలియనప్పటికీ.. యూఏఈ, పాకిస్తాన్‌లో 20-25 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొంత కాలంగా కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ద్రవ్యోల్భణం గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు దేశాలను అప్పుల కోసం అభ్యర్థిస్తోంది. విదేశీమారక నిల్వలు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతులు తగ్గాయి. చివరకు పాకిస్తాన్ తన పాస్ పోర్టులను ముద్రించుకోవడానికి కూడా కాగితాన్ని దిగుమతి చేసుకోలేకపోతోంది. దీంతో పాటు అక్కడి గ్యాస్, విద్యుత్, ఇంధనం ధరలు పెరిగాయి. ప్రజలు వీటిని తగ్గించాలని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నారు.

అంతకుముందు పాక్ ప్రధాని, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ తో సమావేశం నిర్వహించారు. దీనికి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ఆర్థిక రంగంలో పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చినందుకు ఆ దేశ ప్రధాని కాకర్ యూఏఈకి థాంక్స్ తెలిపారు. COP2 సదస్సుకు యూఏఈ ప్రెసిడెన్సీకి ఇస్లామాబాద్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.