దక్షిణ తైవాన్‌ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు.
ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్‌సియంగ్‌ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు. గంటకు 135 కిలోమీటర్ల (గంటకు 85 మైళ్లు) గాలులతో టైఫూన్ క్రాథాన్ గురువారం మధ్యాహ్నం దక్షిణ తైవాన్‌ను తాకింది. ఈ తుఫాన్ కేటగిరీ 1 అట్లాంటిక్ హరికేన్‌తో సమానం.
తైవాన్ సెంట్రల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ప్రకారం. ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపింది. 219 మంది గాయపడ్డారని, ఒక వ్యక్తి కూడా తప్పిపోయినట్లు తెలిపారు. ఈ విపత్తు గురించి ముందుగానే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక తైవాన్‌ను భారీ వరదలు ముంచెత్తడంతో పాఠశాలలు, స్టాక్ మార్కెట్లను మూసివేశారు. వందల సంఖ్యలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. లక్షకు పైగా గృహాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి 38,000 మందికి పైగా తైవాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఇక తుఫాన్ బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోటార్ సైకిళ్లు, పరంజా నిర్మాణాలు ఎగిరిపోయాయి. పైకప్పులు కూడా గాల్లోకి ఎగిసిపడ్డాయి. ఇక తుఫాన్ కారణంగా ఒక ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలను అదుపు చేశారు.