Site icon NTV Telugu

US: వాషింగ్టన్‌లో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి

Us

Us

అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్‌ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.

వాష్టింగ్టన్‌లోని యూదు మ్యూజియం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బంది మరణించారు. బాధితులు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు. కానీ ఇద్దరు కూడా అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య మిషన్‌తో అనుబంధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీన్ని యూదు వ్యతిరేక ఉగ్రవాద దుర్మార్గపు చర్యగా పోలీసులు అభివర్ణించారు. హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం ప్రార్థించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన

ఇక అనుమానితుడు చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్‌గా గుర్తించారు. కాల్పులకు ముందు మ్యూజియం వెలుపల తిరుగుతూ కనిపించాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు.. ‘‘పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వండి’’ అని నినాదాలు చేశాడు.

ఇది కూడా చదవండి: Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు..!

కాల్పుల గురించి తనకు సమాచారం అందించినట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ‘‘ఈ రాత్రి డౌన్‌టౌన్ డీసీలో కాపిటల్ జ్యూయిష్ మ్యూజియం వెలుపల మరియు మా వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్ సమీపంలో జరిగిన కాల్పుల గురించి నాకు మరియు నా బృందానికి సమాచారం అందింది. మేము స్పందించడానికి మరియు  తెలుసుకోవడానికి ఎంపీడీతో కలిసి పని చేస్తున్నప్పుడు.. దయచేసి బాధితులు మరియు వారి కుటుంబాల కోసం ప్రార్థించండి. మేము వీలైనంత వరకు ప్రజలకు తెలియజేస్తాము.’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఇక కాల్పుల ఘటన గురించి సమాచారం అందిన వెంటనే వాషింగ్టన్ డీసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మ్యూజియం చుట్టూ  భద్రతను పెంచారు. సాక్షులు మరియు నిఘా ఫుటేజ్ కోసం శోధిస్తున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇక ఈ దాడిని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఖండించారు.

Exit mobile version