Two earthquakes of 4.7 and 5.3 magnitudes strike Nepal: హిమాలయ దేశం నేపాల్ ను వరసగా భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా బుధవారం నేపాల్ లో రెండు భూకంపాలు సంభవించాయి. నేషనల్ ఎర్త్ క్వేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున నేపాల్ లోని బగ్‌లుంగ్ జిల్లాలో 4.7, 5.3 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. జిల్లాలోని అధికారి చౌర్ ప్రాంతంలో తెల్లవారుజామున 1.23 గంటలకు 4.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ తరువాత ఖుంగా ప్రాంతంలో 2.07 గంటలకు రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు.
Read Also: Air India Express: యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ మార్గదర్శకాలు జారీ
బుధవారం ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో వచ్చింది. తెల్లవారుజామున 2.19 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు గుర్తించారు.
ఎర్త్ క్వేక్ హైరిస్క్ ఉన్న ప్రాంతాల్లో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలను ఆనుకుని ఉన్న ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, కాశ్మీర్ తో పాటు పలు ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. నేపాల్ ప్రాంతం కూడా భూకంపాలతో చాలా ప్రభావితం అవుతోంది. హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు ఎక్కువగా అవుతుండటంతో వెలువడే శక్తి భూకంపాల రూపంలో కనిపిస్తోంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం దిశవైపు జరుగుతూ, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ను ముందుకు నెడుతోంది. దీంతోనే భూకంపాలు వస్తున్నాయి. ఈ పరిణామం వల్లే కొన్ని లక్షల ఏళ్ల క్రితం హిమాలయాలు ఏర్పడ్డాయి.