Site icon NTV Telugu

JPMorgan CEO: అమెరికాలో ఆర్థిక మాంద్యం, భారత్‌తో బలమైన సంబంధాలు అవసరం

Jpmorgan Ceo

Jpmorgan Ceo

JPMorgan CEO: డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ‘‘పరస్పర సుంకాలు’’ విధించడం సొంత దేశంలోని ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఇటీవల ‘‘హ్యాండ్స్ ఆఫ్’’ నిరసనలు జరిగాయి. యూఎస్ వ్యాప్తంగా పలు నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. మరోవైపు, ట్రంప్ టారిఫ్స్ అమలులోకి వచ్చే ముందే, తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు అమెరికన్లు సూపర్ మార్కెట్లకు క్యూ కట్టారు.

ఇదిలా ఉంటే, JP మోర్గాన్ చేజ్ & కో సీఈఓ జానీ డిమోన్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ వాటాదారుకు లేఖ రాశారు. ట్రంప్ కొత్త వాణిజ్య సుంకాల గురించి లేఖలో తన ఆందోళన వ్యక్తం చేశారు. సుంకాల వల్ల అమెరికా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవచ్చని హెచ్చరించారు. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికా వ్యాప్తంగా ధరల్ని పెంచే అవకాశంతో పాటు దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉంటాయని, స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగితే వాటి ధరలు పెరుగుతాయని విమరించారు. ‘‘ఇటీవల సుంకాల చర్యల వల్ల ద్రవ్యోల్బణం పెంచే అవకాశం ఉంది. చాలా మంది మాంద్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

Read Also: Summer Tips: వేసవిలో తీసుకోవల్సిన జాగ్రత్తలివే..!

ఆర్థిక వృద్ధి మాంద్యం లేకున్నప్పటికీ కూడా తిరోగమనం చెందొచ్చని అన్నారు. పూర్తిస్థాయిలో మాంద్యం రాకున్నా, సుంకాల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని డిమోన్ అన్నారు. ఖర్చులు పెరిగే కొద్దీ, కంపెనీలు ఆ ఖర్చులను వినియోగదారులపై మోపవచ్చని, ఇది దేశీయ ధరల పెరుగుదలకు దారి తీస్తుందని చెప్పారు. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, దేశీయ ఉత్పత్తిపై డిమాండ్ పెరగడం వల దిగుమతి చేసుకున్న వస్తువులపై మాత్రమే కాకుండా దేశీయ ధరలపై కూడా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని చూసే అవకాశం ఉంనని అన్నారు.

భారత్‌తో బంధం పటిష్టం చేసుకోవాలి..

సుంకాలపై హెచ్చరికలతో పాటు అమెరికా ప్రభుత్వానికి డిమోన్ ఒక సూచన చేశారు. సంఘర్షణ కన్నా భారత్, బ్రెజిల్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం అమెరికాకు మంచిదని అన్నారు. అలీన దేశాలతో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను మెరుగుపరచుకోవడానికి యూఎస్ కృషి చేయాలని సూచించారు. అమెరికాకు ప్రస్తుతం తన సన్నిహిత భాగస్వామ్య దేశాలతో సరైన వాణిజ్య ఒప్పందాలు లేవని డిమోన్ ఎత్తిచూపారు. ప్రస్తుతం వాణిజ్య సుంకాల్లో భాగంగా అమెరికా భారత్‌పై 26 శాతం, బ్రెజిల్ పై 10 శాతం సుంకాలను విధించింది.

Exit mobile version