Site icon NTV Telugu

Trump: తైవాన్‌ జోలికి పోవద్దు.. చైనాకు వార్నింగ్.. కొద్దిరోజులకే మారిన ట్రంప్ స్వరం

Trump5

Trump5

ఇటీవలే దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరూ కలిశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ను ట్రంప్ ప్రశంసలతో ముంచెత్తారు. గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. సమావేశం తర్వాత 10 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కూడా ట్రంప్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. తాజాగా చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్‌పై దాడిచేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఆ దేశ ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఆదివారం సీబీఎస్ న్యూస్‌తో ‘60 మినిట్స్’ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం పాల్గొంటుందా..? అని ప్రశ్న ఎదురైంది. ‘‘ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంతకాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు.’’ అని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ

గత వారం దక్షిణ కొరియా వేదికగా ట్రంప్‌, జిన్‌పింగ్‌ సమావేశం అయ్యారు. రెండు గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్‌లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని చెప్పారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. కానీ ఇంతలోనే ట్రంప్ స్వరం మారింది. కొద్దిరోజులకే ఏం జరిగిందో.. ఏంటో తెలియని పరిస్థితి.

Exit mobile version