Site icon NTV Telugu

Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్.. ఎందుకోసమంటే..!

Trump5

Trump5

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారో.. లేదో వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు వాణిజ్య యుద్ధంతో ఇంకొన్ని దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది యుద్ధాలే అన్నట్టుగా అనూహ్యంగా అమెరికా సైనిక బడ్జెట్‌ను పెంచేశారు. 2027 నాటి సైనిక బడ్జెట్‌ను 1 ట్రిలియన్ నుంచి 1.5 ట్రిలియన్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 36 శాతాన్ని సూచిస్తుంది. ప్రపంచ భద్రతా పరిస్థితి దుర్బలంగా ఉండటంతో ఇది అవసరం అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అమెరికా సైన్యాన్ని ‘‘డ్రీమ్ మిలిటరీ’’గా తీర్చదిద్దడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.

సెనేట్, కాంగ్రెస్, ప్రభుత్వ విభాగాలు, ఇతర రాజకీయ ప్రతినిధులతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి చాలా సున్నితమైందని.. ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అందుకోసమే అమెరికా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చాలా అవసరంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.

రక్షణ బడ్జెట్ పెంపుతో కలల సైన్యం నిర్మించబడుతుందని తెలిపారు. ఈ బడ్జెట్‌తో విదేశీ సవాళ్లను ఎదుర్కోవడానికి.. జాతీయ భద్రతను కాపాడటానికి అమెరికా సైన్యాన్ని శక్తివంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఇంత బడ్జెట్ పెరగడానికి టారిఫ్ విధానమే కారణమని చెప్పారు. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌లు కారణంగా దేశానికి గణనీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయంతో దేశభక్తిగల మధ్యతరగతి పౌరులకు ఆర్థిక ప్రయోజనాలను కూడా పెంచుతుందని చెప్పారు.

ఇప్పటికే పెంపు..
గత డిసెంబర్‌ ప్రారంభంలోనే అమెరికా సెనేట్ 2026 సంవత్సరానికి 901 బిలియన్ల రక్షణ బడ్జెట్‌ను ఆమోదించింది. ఇక 2027 సంవత్సరానికి ఆ బడ్జెట్‌ను మరింత పెంచేశారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ ఈ అడుగులు వేస్తున్నారు.

Exit mobile version