Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!

  • ఎన్విడియా తదుపరి సీఈఓగా టిమ్ కుక్ సరైనోడు..
  • జెన్సన్ హువాంగ్ అద్భుతంగా పనిచేశారు..
  • ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ రావాలి..
  • ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Trump

Trump

Nvidia CEO: ఎన్విడియా సీఈఓ పదవికి జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. ఆలిస్ హువాంగ్ అనే మహిళతో వివాహేతర సంబంధం, ఆమె చైనా తరుఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో జెన్సన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు ఆయన ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డ్ మెంబర్ పదవులకు రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈఓగా కోలెట్ క్రెస్‌ నియమితులయ్యారు.

ఇదిలా ఉంటే, ఎన్విడియా తదుపరి సీఈఓగా ఆపిల్ అధినేత టిమ్ కుక్‌ను నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన స్థానాన్ని భర్తీ చేయగలిగే సత్తా టిమ్ కుక్‌కు మాత్రమే ఉందని, ఆయనే సరైనోడు అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టారు.

“ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ అద్భుతమైన పని చేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేసినందున, ఆయన స్థానంలోకి రావాల్సిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. ఆయనే యాపిల్‌కు చెందిన టిమ్ కుక్. ఒక లెజెండ్ స్థానంలో మరో లెజెండ్ వస్తారు!” అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

2025 నుంచి జెన్సన్ హువాంగ్, ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలు బలపడ్డాయి. గత రెండేళ్లుగా హువాంగ్ వైట్‌హౌజ్ ఎజెండాను పదే పదే సమర్థిస్తున్నారు. చైనా మార్కెట్‌కు అధునాతన సెమీకండక్టర్‌లను విక్రయించేందుకు ఎన్విడియాకు అనుమతులు ఇచ్చే అంశంపై అమెరికాతో లాబీయింగ్ చేశారు. ఈ ఏడాది మేలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించిన సమయంలో హువాంగ్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ వెంట ప్రయాణించారు. సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం వైట్‌హౌస్‌లో నిర్వహించిన విందుకు కూడా హాజరయ్యారు.