ఫ్రాన్స్ వేదికగా బుధవారం జీ 7 సదస్సులో ప్రధాని మోడీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక సంభాషణ జరిగింది. పనిలో పనిగా మోడీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోను ట్రూత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘చీజ్ చెప్పండి’ అంటూ ఫొటో పెట్టారు. ఈ ఫొటోలో మోడీ-ట్రంప్‌తో సహా భారత్‌లోని అమెరికా రాయబారి అయిన సెర్గియా గోర్ కూడా ప్రత్యక్షమయ్యారు.
ఫొటోను సెర్గియో గోర్ పోస్టు చేయగా.. దాన్ని ట్రంప్ రీషేర్ చేశారు. అమెరికాలో భారత పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. భారత కంపెనీలు టెక్నాలజీ, తయారీ, ఔషధ రంగాల్లో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించాయి’’ అని సెర్గియా గోర్ వెల్లడించారు. 12 భారతీయ కంపెనీలు 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయని.. ఇవి అమెరికాలో ఉపాధి అవకాశాలు, సరఫరా గొలుసులను బలోపేతం చేస్తాయని తెలిపారు.
2025 ఫిబ్రవరిలో మోడీ అమెరికా పర్యటన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మోడీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మాకు చాలా మంచి సమావేశం జరిగింది. మోడీ చాలా తెలివైన నాయకుడు. కఠినమైన చర్చాకర్త. భవిష్యత్తులో ఎప్పుడో ఒక సమయంలో నేను భారత్‌ను సందర్శిస్తాను.’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల భారత్-అమెరికా సంబంధాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భారత వస్తువులపై అమెరికా సుంకాలు, రష్యా చమురు కొనుగోళ్లపై ఆంక్షలు, గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల్లో భారత నావికుల మృతి వంటి అంశాలు ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. హార్ముజ్ జలసంధిలో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భారతీయ నావికులు సముద్ర వాణిజ్య మార్గాల్లో సేవలందిస్తున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిలో వారి భద్రత మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం’’ అని మోడీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ఈ అవగాహన కుదిరేందుకు మీరు ఎంతో కృషి చేశారు. ఈ ఒప్పందం అమలులో నావికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం లభిస్తుందని నమ్ముతున్నాను’’ అని మోడీ తెలిపారు.
భారతీయ నావికుల మరణాలపై సంతాపం తెలిపారా అని ప్రశ్నించగా.. ట్రంప్ ‘‘అది చాలా ప్రమాదకరమైన వృత్తి. మేము కలిసి పనిచేస్తున్నాం. వారంతా గొప్ప వ్యక్తులు’’ అని స్పందించారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన ట్రంప్.. ‘‘భారత్‌పై ఎవరైనా దాడి చేస్తే మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎవరైనా మోడీపై దాడి చేస్తే మేము ఆయనకు అండగా ఉంటాం’’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదిలా ఉంటే మోడీ-ట్రంప్ భేటీ మరుసటి రోజే ఢిల్లీలో అమిత్ షాను సెర్గియా గోర్ కలవడం ఆసక్తి రేపుతోంది. ఉగ్రవాదంపై చర్చించినట్లుగా గోర్ తెలిపారు.

