పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. నిన్నామొన్నటిదాకా దాడులు-ప్రతిదాడులతో దద్దరిల్లిన మధ్యప్రాచ్యం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
తాజాగా ఈ అంశంపై ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని తెలిపారు. గత వారం జరిగిన దాడుల అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని… ఇరాన్ అణు నిరాయుధీకరణ ప్రక్రియ కూడా సరైన దిశలో సాగుతోందని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ‘‘ఇరాన్‌తో మా సంబంధాలు చాలా బాగున్నాయి. అణు నిరాయుధీకరణపై చర్చలు మంచి పురోగతిలో ఉన్నాయి. సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.’’ అని అన్నారు.
రాయిటర్స్ కథనం ప్రకారం.. అమెరికా-ఇరాన్ ప్రతినిధులు బుధవారం ఖతార్ రాజధాని దోహాలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెండు కీలక అంశాలపై చర్చించారు. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడడం, అలాగే ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖరారు చేయడం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. అమెరికా-ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దౌత్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఖతార్‌తో పాటు పాకిస్థాన్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తోంది.
చర్చలకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ఖతార్ ప్రధానమంత్రితో సమావేశమై చర్చలకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే సాంకేతిక స్థాయి చర్చల్లో మాత్రం వారు ప్రత్యక్షంగా పాల్గొనలేదని తెలుస్తోంది.
చర్చలపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్.. గత వారం ఇరాన్‌పై అమెరికా నిర్వహించిన దాడులను కూడా ప్రస్తావించారు. ‘‘గత వారం మేము ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఇరాన్‌తో మా సంబంధాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. వారు కూడా చాలా మారారు.’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై ప్రశ్నించగా.. ‘‘వాళ్లు బాగానే ఉన్నారని నేను భావిస్తున్నాను.’’ అంటూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య చర్చలు భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
#WATCH | When asked if he is unhappy with the MoU with Iran, US President Donald Trump says, "They've come a long way. We hit them very hard last week. They're fine. We're going to get it. It's the denuclearisation of Iran… Iran cannot have a nuclear weapon. Otherwise, all of… pic.twitter.com/UUiteEfIfq
— ANI (@ANI) July 1, 2026

