Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!

  • ట్రంప్‌పై డెమోక్రాట్ల సంచలన రిపోర్ట్..
  • మాజీ మిస్ స్విట్జర్లాండ్‌పై దారుణంగా అత్యాచారం..
  • అప్రతిష్టపాలు చేయడానికే అని ఖండించిన వైట్‌హౌజ్..
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ మిస్ స్విట్జర్లాండ్ బియాట్రిస్ క్యూల్ సంచలన ఆరోపణలు చేసినట్లు డెమోక్రటిక్ పార్టీ రూపొందించిన ఓ నివేదిక పేర్కొంది. 1993 నవంబర్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. ఇదే కాకుండా లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సంబంధాలపై జరిగిన విచారణ వివరాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి. అయితే, ఈ నివేదికలోని ఆరోపణల్ని వైట్ హౌజ్ ఖండించింది. జనాల్లో ట్రంప్ పాపులారిటీని దెబ్బతీసేందుకు డెమోక్రాట్లు ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించింది.

నివేదికలోని ఆరోపణలు ఏంటి..?

అమెరికా ప్రతినిధుల సభ న్యాయవ్యవహారాల కమిటీలోని డెమోక్రాట్లు 53 పేజీల నివేదికను విడుదల చేశారు. ఇందులో ట్రంప్‌పై గతంలో వచ్చిన లైంగిక ఆరోపణల్ని మరోసారి ప్రస్తావించింది. ఒకప్పుడు ట్రంప్‌కు సన్నిహితుడిగా ఉన్న ఎప్‌స్టీన్ 2019లో ఫెడరల్ కస్టడీలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ల అక్రమ రవాణా, లైంగిక నేరాల ఆరోపణల్ని ఎదుర్కొన్నాడు.

డెమోక్రాట్లతో క్యూల్ నిర్వహించిన పలు ఇంటర్వ్యూల వివరాలు కూడా నివేదికలో ఉన్నాయి. 1993లో ట్రంప్ తనపై దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్లు ఆమో ఆరోపించినట్లు నివేదికలో ఉంది. ఎప్‌స్టీన్‌తో కొంత సమయం గడిపిన తర్వాత, అట్లాంటిక్ సిటీలోని ట్రంప్ ప్లాజా హోటల్ గదితో తనపై అత్యాచారం చేసినట్లు ఆమె వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. తనకు 24 ఏళ్ల వయసు ఉన్న సమయంలో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో జరిగిన అందాల పోటీల్లో తొలిసారిగా ట్రంప్‌ను కలిసినట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.

క్యూల్‌కు వీసా ఇప్పించడంతో పాటు న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రవేశం పొందేలా ట్రంప్ సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ తరుఫున ఒక ప్రతినిధి, ప్లాజా హోటల్ పై అంతస్తులో ట్రంప్‌ను కలవాలని క్యూల్‌ను ఆహ్వానించినట్లు డెమోక్రాట్ల నివేదిక ఆరోపించింది. గదిలోకి వెళ్లగానే ట్రంప్ క్యూల్‌ను బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో ఆమె దుస్తుులు చిరిగిపోయాయని, శరీరంలో పలు భాగాల్లో రక్తస్రావం, నీలిరంగులో గాయాలు ఏర్పడినట్లు నివేదిక పేర్కొంది. ఈ సమయంలో మళ్లీ వీసా, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రవేశంపై ట్రంప్ హామీ ఇచ్చాడని, ఈ విషయం ఎవరితో చెప్పకూడదని ప్రమాణం కూడా చేయించుకున్నట్లు నివేదిక వెల్లడించింది.