Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీలకు సంబంధించి ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రముఖ AI సంస్థలు అమెరికన్ ప్రజలకు తమ కంపెనీల్లో వాటాలను (Shares) ఇచ్చేలా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురావాలని తన బృందం యోచిస్తోందని ఆయన వెల్లడించారు. వచ్చే వారం AI రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో తాను సమావేశం కానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. “ఇది చాలా ఆసక్తికరమైన ఆలోచన. దీనివల్ల AI కంపెనీలకు, అమెరికా ప్రజలకు మధ్య ఒక మంచి భాగస్వామ్యం ఏర్పడుతుంది. దీనిపై మేము కచ్చితంగా ఆలోచిస్తాం” అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ భాగస్వామ్యంపై ముందస్తు చర్చలు
పలు నివేదికల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులు అప్పుడే కొన్ని AI కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వం కొన్ని ప్రముఖ AI సంస్థల షేర్లను కొనుగోలు చేసి, వాటిలో భాగస్వామ్యం తీసుకునే అవకాశం ఉందనే అంశం కూడా ఈ చర్చల్లో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాబోయే సమావేశం గురించి కానీ, ప్రభుత్వ వాటాల గురించి కానీ వైట్ హౌస్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
రేసులో ఉన్న ప్రముఖ కంపెనీలు ఇవే..
ఈ నివేదికల ప్రకారం.. అమెరికా ప్రభుత్వ భాగస్వామ్యం ఆశిస్తున్న ప్రధాన కంపెనీల జాబితాలో ముందు వరుసలో ఉన్న కంపెనీలు.. OpenAI, Anthropic, Google, Facebook (Meta), SpaceX. అయితే ఈ ప్రతిపాదనలపై ఈ కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నిజానికి AI సాంకేతికతపై ఎంత వరకు కఠినమైన నిబంధనలు విధించాలనే దానిపై ట్రంప్ ప్రభుత్వం చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. మే 21న AI కి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయాల్సి ఉండగా, దానిని చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ ఉత్తర్వుల్లోని కొన్ని నిబంధనలపై టెక్ కంపెనీలు అభ్యంతరం వ్యక్తం చేయడమే దీనికి కారణం అని సమాచారం. AI రంగంలో చైనాతో పోటీ పడుతున్న తరుణంలో, అమెరికా వెనుకబడిపోయేలా చేసే ఎలాంటి నిర్ణయాన్ని తాను తీసుకోనని ఆ సమయంలో ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఆ ఉత్తర్వులను సవరించి కొత్త ఆదేశాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. పెద్ద AI కంపెనీలు తమ అత్యంత అధునాతన AI మోడళ్లను ప్రజల్లోకి రిలీజ్ చేయడానికి ముందే.. వాటిని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ పరీక్షల కోసం సమర్పించాల్సి ఉంటుంది.
ఇటీవల ‘Anthropic’ సంస్థ రిలీజ్ చేసిన అత్యంత శక్తివంతమైన ‘Mythos’ అనే కొత్త టూల్ కారణంగా సైబర్ భద్రతపై ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ టెక్నాలజీ గనుక సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే.. బ్యాంకింగ్ వంటి కీలక రంగాలపై భారీ దాడులు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇలా కంపెనీల్లో ప్రభుత్వం వాటాలు తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వానికి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఇంటెల్ (Intel)తో పాటు కొన్ని కీలకమైన క్వాంటం టెక్నాలజీ, రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజాల) కంపెనీల్లో అమెరికా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి వాటాలను దక్కించుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

