Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని, ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి కఠినమైన చర్యలు విధించాలని శనివారం నాటో దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో దేశాలతో పాటు ప్రపంచాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ లేఖ రాశారు. ‘‘అన్ని నాటో దేశాలు అంగీకరించి రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేసినప్పుడు, నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నాను. రష్యాపై విజయానికి నాటో నిబద్ధతన ఇప్పటి వరకు 100 శాతం లేదు. కొన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం షాకింగ్ విషయమే. ఇది రష్యాతో మీరు జరిపే చర్చల్లో మీ స్థానాన్ని తీవ్రంగా బలహీనపరుస్తుంది’’ అని అందులో పేర్కొన్నారు.
నాటో సభ్యులు అంతా కలిసి ఆంక్షలకు సిద్ధంగా ఉన్నప్పుడు, తాను కూడా ఆంక్షలపై ముందుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నారు. మాస్కోపై చైనా ప్రభావాన్ని బలహీనపరచడానికి, చైనాపై నాటో దేశాలు అధిక సుంకాలు విధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వాటిని ఉపసంహరించుకునేలా చైనాపై 50-100 శాతం సుంకాలను విధించాలని ట్రంప్ కోరారు. ఇది యుద్ధం ముగింపుకు గొప్ప సహాయం చేస్తుందని ట్రంప్ అన్నారు. రష్యాపై చైనాకు బలమైన నియంత్రణ, పట్టు ఉంది, ఈ సుంకాలు ఆ శక్తిని విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ చెప్పారు.