Site icon NTV Telugu

Trump: భారత్‌ టారిఫ్‌లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్‌హౌస్‌లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!

Trump2

Trump2

అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌పై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. భారతదేశంతో తాము బాగా కలిసి పోతామని చెప్పారు.

ఇది కూడా చదవండి: IRDAI Fraud: వీడు మాములోడు కాదు.. పని చేస్తున్న కంపెనీలో డబ్బు కొట్టేయాలని ప్లాన్

చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య సంబంధం ఏకపక్షంగా ఉండేదని.. తాను బాధ్యతలు స్వీకరించాకే అది మారిందని చెప్పారు. భారతదేశం.. అమెరికాపై దారుణంగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది ప్రపంచంలోనే అత్యధికం అని పేర్కొన్నారు. అందువల్లే అమెరికా.. భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదని చెప్పుకొచ్చారు. కానీ వారు మాత్రం మాతో బాగా వ్యాపారం చేస్తున్నారని.. ఎందుకంటే వారి దగ్గర నుంచి మేము పెద్దగా వసూలు చేయడం లేదు కాబట్టే ఇలా జరుగుతుందని వివరించారు. అందుకే భారత్ ఉత్పత్తులను అమెరికాలో కుమ్మరిస్తోందని తెలిపారు. పైగా భారత్ నుంచి వచ్చే వస్తువులు అమెరికాలో తయారు కావు కాబట్టే ఇలా జరుగుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు.. హార్లే-డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ భారతదేశంలో అమ్మలేకపోయిందని.. దానికి కారణం మోటార్ సైకిల్‌పై 200 శాతం సుంకం ఉందని గుర్తుచేశారు. హార్లే-డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించిందని.. ఇప్పుడు వారు సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను ట్రంప్ పూర్తిగా సమర్థించారు.

ఇది కూడా చదవండి:Lokesh Kanagaraj: ఇకపై అతను లేకుండా సినిమా చేయను.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

భారత్‌పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇదిలా ఉంటే మంగళవారం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ..భారతదేశం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోందని తెలిపారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఐదు రౌండ్ల చర్చలు జరిగాయని.. మరొకసారి చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కొత్త తేదీలు ఇంకా వెల్లడి కాలేదన్నారు.

Exit mobile version