ఇరాన్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులను ఉరితీస్తే అమెరికా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను ఉరి గురించి వినలేదు. వాళ్లు ఉరితీస్తే.. మీరు కొన్ని విషయాలు చూడబోతున్నారు. వాళ్లు అలాంటి పని చేస్తే మేము చాలా కఠినమైన చర్య తీసుకుంటాము.’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇక ఖమేనీకి వ్యతిరేకంగా ఇరానియన్లు నిరసన వ్యక్తం చేస్తూనే ఉండాలని సోషల్ మీడియాలో ట్రంప్ పిలపునిచ్చారు. ఇక నిరసనకారులకు సహాయం అందుతోందని చెప్పారు. ఇక నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ అధికారులతో ఎలాంటి సమావేశాలు ఉండవని.. ముందుగా నిర్ణయించిన సమావేశాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.
డిసెంబర్ 28 నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నెమ్మదిగా ప్రారంభమైన నిరసనలు క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. దీంతో భద్రతా దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అధికారికంగా 2 వేల మంది నిరసనకారులు చనిపోయినా.. ఆ సంఖ్య 12 వేల వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. టెహ్రాన్ నగర వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ శవాలు పడి ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే డజన్ల కొద్దీ భద్రతా సిబ్బంది కూడా చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది.
