Site icon NTV Telugu

Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్‌ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump1

Trump1

మొత్తానికి 40 రోజుల తర్వాత పశ్చిమాసియా శాంతించింది. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్యంలో వైమానిక, డ్రోన్, బాంబు దాడి శబ్దాలు ఆగిపోయాయి. నిన్నటి నుంచి పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ నాగరికత అంతం చేస్తామని.. విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, చమురు కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. చివరికి రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించడంతో అంతటా ఊపిరి పీల్చుకున్నారు.

ఇరాన్ ఒప్పందం అమెరికాకు ‘‘సంపూర్ణ విజయం’’గా ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీతో ట్రంప్ అన్నారు. ‘‘సంపూర్ణ విజయం సాధించాం. నూటికి నూరు శాతం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు.’’ అని కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు టెహ్రాన్‌కు రెండు వారాలు గడువు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. చర్చలకు ఇరాన్‌ను చైనా ఒప్పించిందని తాను నమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పినట్లు ఏఎఫ్‌పీ నివేదించింది. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేందుకు ఇరాన్‌ను చర్చల దగ్గరకు తీసుకురావడానికి చైనా సహాయపడిందని తాను విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. చర్చలకు ఒప్పించడానికి బీజింగ్ ప్రమేయం ఉందా అని అడిగినప్పుడు.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ యురేనియం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని ట్రంప్ అన్నారు.

ఇదిలా ఉంటే ఓ వైపు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించగా.. ఇంకోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇరాన్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. బుధవారం తెల్లవారుజామున వెంటవెంటనే మూడు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడి చేసనట్లుగా సమాచారం.

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక నేతలంతా చనిపోయారు. ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.

అయితే హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌ను అంతం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరానీయులంతా రోడ్లపైకి వచ్చారు. విద్యుత్ ప్లాంట్ల దగ్గర మానవహారాలుగా ఏర్పడి నిరసన తెలిపారు. మొత్తానికి 40 రోజుల తర్వాత కాల్పుల విరమణతో మధ్యప్రాచ్యం శాంతించింది.

Exit mobile version