Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు. ఈ ఏడాది మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య సంఘర్షణలో తానే మధ్యవర్తిత్వం వహించినట్లు చెప్పుకున్నారు. భారత్ ఇప్పటికే ట్రంప్ వాదనల్ని ఖండించినప్పటికీ, ట్రంప్ అనేక సార్లు ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు.
కంబోడియా – థాయిలాండ్, సెర్బియా, కాంగో – రువాండా, పాకిస్తాన్ – భారతదేశం, ఇజ్రాయెల్ – ఇరాన్, ఈజిప్ట్ – ఇథియోపియా, అర్మేనియా – అజర్‌బైజాన్‌ల మధ్య యుద్ధాలను ఆపినట్లు చెప్పారు. ఇన్ని యుద్ధాలు ఆపినందకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని ఇప్పటికే ట్రంప్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని తాను ‘‘వాణిజ్యం’’తో ఆపేశానని చెప్పారు. ఇరు దేశాలను వ్యాపారంతో బయటపెట్టినట్లు చెప్పుకొచ్చారు.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలతో పాటు పాక్ వైమానిక దళానికి చెందిన ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యానికి చెందిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) అభ్యర్థన మేరకు భారత్ కాల్పుల విమరణకు అంగీకరించింది. ఇదే విషయాన్ని భారత్ పలుమార్లు చెప్పింది. చివరకు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని చెప్పారు. మూడో పక్షం ప్రయేమయాన్ని ఆయన వ్యతిరేకించారు.
