NTV Telugu Site icon

Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..

Ibrahim Aqil

Ibrahim Aqil

Hezbollah: హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్లతో షాక్‌లో ఉన్న హిజ్బుల్లాని చావుదెబ్బ తీస్తోంది. ఇప్పటికే పేజర్ల పేలుళ్లలో 37 మంది ఆ సంస్థ మద్దతుదారులతో పాటు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. 3000 మంది ఈ పేలుళ్ల కారణంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే శుక్రవారం హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో 8 మంది మరణించారని, డజన్ల సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది.

Read Also: Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై పాము హల్‌చల్.. ప్రయాణికులు పరుగులు

ఇదిలా ఉంటే, ఈ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ మరణించినట్లు సమాచారం. దక్షిణ బీరూట్‌లోని మిలిటెంట్ గ్రూప్ ప్రధాన స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో దాని ఎలైట్ ఫోర్స్ రద్వాన్ యూనిట్ అధిపతి ఇబ్రహీం అకిల్ చనిపోయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరు వర్గాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి హమాస్‌కి హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. తరుచుగా ఉత్తర ఇజ్రాయిల్‌పై దాడులకు తెగబడుతోంది. తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇది మూడో దాడి.

ఈ ఏడాది జూలైలో హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌ని ఇలాగే వైమానిక దాడిలో ఇజ్రాయిల్ హతమార్చింది. బీరూట్‌లో అతను నివాసం ఉండే భవనంపై దాడి జరిగింది. అంతకుముందు హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరూరి కూడా వైమానిక దాడిలో మరనించాడు. ఫువాద్ షుక్ర్ తర్వాత హిజ్బుల్లా సాయుధ దళానికి సెకండ్ ఇన్ కమాండ్ అయిన రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్ మరణించినట్లు ఆ మిలిటెంట్ సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటి వరకు హిజ్బు్ల్లా ఎలాంటి అధికారిక ప్రకటనని విడుదల చేయలేదు. 1983లో బీరుట్‌లోని యుఎస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేసి 63 మంది మృతి ఘటనలో అకిల్ ప్రధాన సభ్యుడు. ఇతడి కోసం అమెరికా 7 మిలియన్ల బహుమతి ప్రకటించింది.