AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఇప్పుడు టెక్ ప్రపంచం అంతా దీని చుట్టే తిరుగుతోంది. రానున్న కాలంలో మానవుడి మనుగడ మరింత స్మార్ట్ కావడానికి ఏఐ కీలకంగా మారుతుంది. ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ కంపెనీలు ఏఐ మీద దృష్టి పెట్టి కొట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నాయి. ఇదిలా ఉంటే నాణేనికి మరో వైపు మాత్రం ఏఐ వల్ల చాలా మంది కొలువులు పోతున్నాయి. రానున్న కాలంలో పలు రంగాల్లో ఉద్యోగులను తొలగించి వారి స్థానాలను ఏఐతో రిప్లేస్ చేయబోతున్నారు.
తాజాగా ఏఐ దెబ్బ మీడియాకు కూడా తాకింది. జర్మనీకి చెందిన ప్రముఖ వార్తా సంస్థ తన సిబ్బందిలో 20 శాతాన్ని తొలగించింది. వీరందరి బాధ్యతలను ఏఐకి అప్పగించనుంది. ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ అయిన ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్‌రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి, కొంతమంది ఉద్యోగులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో భర్తీ చేయాలనే నిర్ణయించింది. ముఖ్యంగా ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేయనుంది.
ఎడిటర్లు, ఫోటో ఎడిటర్‌లు, ప్రూఫ్‌రీడర్‌లు, ప్రింటిగ్ సెక్షన్ లో పనిచేస్తున్న పలువురు స్థానాలను ఏఐ రీప్లేస్ చేయబోతోంది. ఈ నిర్ణయంతో యూరప్ వ్యాప్తంగా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికల్లో ఒకటైన బిల్డ్ పై ప్రభావం పడనుంది. ఆక్సెల్ స్ప్రింగర్ అనేది జర్మన్ పబ్లికేషన్స్ ఇది యూరప్ లో ప్రముఖ పత్రికలైన బిల్డ్, వెల్ట్, పొలిటికో, ఇన్ సైడర్ వంటి మల్టీ మీడియా న్యూస్ బ్రాండ్లకు మాతృ సంస్థ.
బిల్డ్ లో ప్రస్తుతం 1000 మంది ఉద్యోగుల్లో 200 మంది ప్రభావితం అవుతున్నారు. వీరి తొలగింపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడి ఉన్నాయి. అయితే AI ఎడిటర్లు, రిపోర్టర్లకు సమయాన్ని ఆదా చేసే విలువైన సాధనంగా మారుతుందని బిల్డ్ ప్రతినిధి అన్నారు. ఇప్పటి వరకు టెక్ సంస్థల్లో మాత్రమే ఆటోమెషన్ పదాన్ని విన్నాం, ఇప్పుడు ఇది మీడియా సంస్థలకు కూడా పాకింది.