ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ద జ్వాలలు నేటికీ ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 5500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా మరోసారి , గాజా పైన ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మరో కీలక అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఇజ్రాయిల్ హమాస్ పైన చేస్తున్న ప్రతీకార దాడుల్లో హమాస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు హతమయ్యారు. ఆదివారం గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి నిర్వహించిందని, ఇందులో హమాస్ ఆర్టిలరి గ్రూప్ డిప్యూటీ హెడ్ మహ్మద్ కటామాష్ మృతి చెందాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.
Read also:Jammu Kashmir: ఉరి సెక్టార్‌లో చొరబడిన పాక్ ఉగ్రవాదులు.. కాల్చిపడేసిన భారత సైన్యం..!
కాగా మహ్మద్ సెంట్రల్ క్యాంప్ బ్రిగేడ్‌లో ఫైర్ అండ్ ఆర్టిలరి మేనేజ్‌మెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని తెలిపింది. ఇతను ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా జరిపిన దాడుల ప్రణాళిక అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాడని వెల్లడించింది. కాగా ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో రాకెట్ ఫైరింగ్ స్క్వాడ్ చీఫ్ సైతం ప్రాణాలు కోల్పోయాడని.. ఇజ్రాయెల్ దళాలు ఆయుధాల ఉత్పత్తి కేంద్రం, సైనిక ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసి ధ్వంసం చేశాయని తెలిపింది. అదే సమయంలో భద్రతా దళాలు ఇద్దరు హమాస్ కమాండోలను సైతం అరెస్టు చేసినట్లు షిన్‌బెట్ ప్రకటించింది. ఇద్దరు కమాండోలు హమాస్‌కు చెందిన నుఖ్‌బర్ కమాండో దళాలకు చెందిన వారని పేర్కొంది.