Gaza: ఇన్నాళ్లు యుద్ధంలో సర్వం కోల్పోయిన గాజా ప్రజలు తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ పరిస్థితికి ‘‘హమాస్’’ ఉగ్రవాదులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు గాజా ప్రజల కోసం ప్రజల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పుకుంటున్న హమాస్‌కి అక్కడి ప్రజల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బుధవారం వరసగా రెండో రోజు, గాజా స్ట్రిప్‌లోని వందలాది మంది పాలస్తీనియన్లు వీధుల్లోకి వచ్చి హమాస్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
Read Also: Disha Salian Case: దిశా సాలియన్ ఆత్మహత్యకు తండ్రి ఎఫైర్ కారణమా..?
అక్టోబర్ 07, 2023లో హమాస్, ఇజ్రాయిల్‌పై భీకర దాడి చేసి 1200 మందిని హతమార్చింది. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని చూడకుండా ఊచకోత కోసింది, ఆ తర్వాత 250 మందిని కిడ్నాప్ చేసి గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి హమాస్ భూస్థాపితం చేసే లక్ష్యంతో ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 50,000లు దాటింది. గాజా స్ట్రిప్ మొత్తం శిథిలాలతో వల్లకాడులా మారిపోయింది. ఈ నేపథ్యంలో గాజా ప్రజలు ‘‘ప్రజలు యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ప్రజలు హమాస్‌ని కోరుకోవడం లేదు’’ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
మంగళవారం, గాజాస్ట్రిప్ లోని బీట్ లాహియాలో మొదటగా నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హమాస్ బయటకు వెళ్లాలి, హమాస్ ఉగ్రవాదులు అంటూ ప్రజలు నినదించారు. ఇటీవల బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయిల్, హమాస్ అంగీకరించాయి. కాల్పులు విరమణ జరిగింది. అయితే, బందీల విడుదలతో హమాస్ జాప్యంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయిల్ మళ్లీ దాడిని తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలోనే గాజా ప్రజలు హమాస్‌కి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నారు, 35 మంది చనిపోయినట్లుగా భావిస్తున్నారు.