ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్‌కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట.. ఇది చిన్నమొత్తమే అయినా.. అసలే కరువు ఆపైన చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితిల్లో.. ఆ దేశానికి పెద్ద మొత్తమే..
ఇక, పొరపాటును తజికిస్తాన్‌లోని రాయబార కార్యాలయానికి పంపిన ఆ మొత్తాన్ని వెనక్కి పంపించాలని తాలిబన్లు కోరినా ఆ దేశం నిరాకరిస్తోంది.. ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీకి మద్దతుదారు అయిన తజికిస్తాన్ ప్రభుత్వం.. తాలిబన్లను ఆదినుంచి వ్యతిరేకిస్తోంది.. తాలిబాన్లు ఉగ్రవాదులని పేర్కొంటున్న ఆ దేశం.. అటువంటి ఉగ్రవాదుల బ్యాంకు అకౌంట్లకి డబ్బు పంపించేది లేదని స్పష్టం చేస్తోంది.. అయితే, ఆ మొత్తాన్ని ఆఫ్ఘన్ నుంచి వలస వచ్చి తజకిస్తాన్‌లో శరణార్థి శిబిరాలలో ఉంటున్న పేదల కోసం ఖర్చుపెడతమాని చెబుతోంది. ఇక, ఓ నివేదిక ప్రకారం, ఈ డబ్బును తజికిస్తాన్‌లో శరణార్థులుగా నివసిస్తున్న పిల్లలకు పాఠశాల విద్యను అందించడానికి ఖర్చు చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బదిలీ చేయవలసి ఉంది. ఘనీ ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయినప్పుడు, తాలిబాన్ ఒప్పందాన్ని రద్దు చేసింది, కానీ, పొరపాటున, ఆ మొత్తాన్ని తజికిస్తాన్‌కు బదిలీ చేసిన తాలిబన్లు.. తలపట్టుకుంటున్నారు.. ఆ డబ్బు వెనక్కి పంపండి మొర్రో అంటూ వేడుకుంటున్నారు.