Afghanistan: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగిన వెంటనే ఆ ప్రాంతంపై తాలిబన్లు దండెత్తగా.. అదే సమయంలో ఆ దేశాధ్యక్షుడు దేశం విడిచి పారిపోవడంతో తాలిబన్ సేనలు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. వెంటనే అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ పాలన మొదలై సోమవారానికి ఏడాది పూర్తైనా ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో ఇంకా ఏకాకిగానే మిగిలిపోయింది. ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు. అమెరికాపై సాధించిన విజయంగా తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. అమెరికా రాయబార కార్యాలయం ఉన్నచోట కొందరు ‘డెత్ టు అమెరికా’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
మరోవైపు తాలిబన్ పాలనలో అఫ్గాన్‌లో పరిస్థితులు దయనీయంగా మారినట్లు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మహిళల హక్కులను తాలిబన్ సర్కారు హరించివేసిందని వెల్లడిస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోవడంతో.. అఫ్గాన్‌ను పాలించేందుకు వారు తీవ్ర కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. విదేశీ ప్రభుత్వాలు దాని పాలకులను గుర్తించడానికి నిరాకరించడంతో దేశం ఒంటరిగా ఉండటం వల్ల ఆర్థిక వ్యవస్థపై భారీ ఒత్తిళ్లు ఉన్నాయి. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిపోగా.. అక్కడ నెలకొన్న పరిస్థితులు లక్షల మందిని పేదరికంలోకి నెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆకలితో అలమటిస్తోన్న అఫ్గాన్‌వాసులు పొట్టచేతపట్టుకొని దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తొలినాళ్లలో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని తాలిబన్లు నమ్మబలికారు. అనంతకం దానిని తుంగలో తొక్కారు. ప్రస్తుతం అక్కడి మహిళల పరిస్థితి దయనీయంగా మారింది. మహిళలు బయటకు రావాలంటే బురఖా ధరించాల్సిందే.
Bill Gates: ప్రధాని మోడీపై బిల్‌గేట్స్ ప్రశంసలు..
గతేడాది ఇదే రోజున తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న వెంటనే ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేల మంది పౌరులు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీశారు. విమానాల వెంట పరుగులు పెడుతూ చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అక్కడి పరిస్థితులను ప్రపంచానికి పరిచయం చేశాయి. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశం చిన్నబిన్నమైంది. ఆర్థిక పతనానికి తోడు విదేశీ సాయం కూడా మందగించింది. దీంతో లక్షల మంది పేదరికంలోకి జారుకున్నారు. తాలిబన్ పాలకులను ఏ దేశమూ గట్టిగా విశ్వసించకపోవడంతో… అంతర్జాతీయంగా అఫ్గాన్ ఒంటరిగా మారింది.