Joe biden – Xi Jinping phone talks On Taiwan Issue: తైవాన్ వివాదం అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతోంది. తాజాగా గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ దాదాపుగా 2 గంటల 17 నిమిషాల పాటు టెలిఫోన్ లో చర్చించారు. ఇద్దరు నేతల మధ్య తైవాన్ అంశమే ప్రధాన ఎజెండాగా ఉంది. తైవాన్ విషయంలో అమెరికా కలుగచేసుకోవడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని.. నిప్పుతో చెలగాటమాడే వారు అదే నిప్పుకు బలవుతారని జిన్ పింగ్, బైడెన్ కు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా..వన్ చైనా విధానానికి కట్టుబడి ఉండాలని కోరారు.
ఇదిలా ఉంటే అమెరికా కూడా అంతే ఘాటుగా చైనాకు జవాబు ఇచ్చింది. తైవాన్ విషయంలో అమెరికా విధానం మారలేదని జోబైడెన్ కుండబద్ధలు కొట్టారు. తైవాన్ జలసంధి అంతలా శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కేలా ఏ రకమైన ఏకపక్ష చర్యలకు పాల్పడినా.. అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని బైడెన్, జిన్ పింగ్ కు చెప్పారు. తైవాన్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు అమెరికా ఒప్పుకోదని అన్నారు. బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జిన్ పింగ్ తో చర్చించడం ఇది ఐదోసారి. ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వ్యాపారం, వాణిజ్యంపై కూడా ఇరు నేతలు చర్చించారు. రెండు దేశాల ఆర్థిక అభివృద్ధి ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలకు సహాయపడుతుందని ఇరు నేతలు భావిస్తున్నారు.
Read Also: Manisha Ropeta: పాకిస్తాన్ పోలీస్ శాఖలో హిందూ మహిళకు అందలం.. తొలి మహిళగా రికార్డ్
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన ఇరు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. ఆమె పర్యటనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది చైనా సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడమే అని వ్యాఖ్యానిస్తోంది. రెచ్చగొట్టే చర్యగా చైనా అభివర్నిస్తోంది.. దీనికి తగిన పరిణామాలు ఉంటాయని అమెరికాను హెచ్చరిస్తోంది. వన్ చైనా విధానంలో తైవాన్ కూడా భాగమే అని చైనా వాదిస్తోంది. అయితే తైవాన్ ను హస్తగతం చేసుకోవాలని చైనా తీవ్రంగా భావిస్తోంది. ఇటీవల తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా తన మిలిటరీని మోహరించింది. పలు సందర్భాల్లో తైవాన్ గగనతల ఆంక్షలను ధిక్కరించి పీఏల్ఏ విమానాలు తైవాన్ గగనతలంలోకి ప్రవేశిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.